విజయవాడ మాచవరంలోని ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడి వల్ల ఏకంగా 30 మందికి కొవిడ్-19 వైరస్ సంక్రమించింది. ఈ తరహా ఉదంతాలు చిరుతిళ్ల వ్యాపారాల వద్ద భాగ్యనగరవాసులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చాటుతున్నాయి. అయినా ఉదయం పూట టిఫిన్ సెంటర్లు, సాయంత్రం పూట చిరుతిళ్ల దుకాణాలకు జనాలు ఎగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. కాలానుగుణ వ్యాధులతో పాటు కరోనా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇతరులకు ముప్పు...
రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని, వెళ్లినా ఎడం పాటించాలని అధికారులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా కనీస పరిశుభ్రత లేని చోట కూడా అల్పాహారాల కోసం జనం క్యూ కడుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత నచ్చిన ఆహారం దొరుకుతుండడం, చిరు వ్యాపారాలకు ఉపాధి లభిస్తుండడం ఆహ్వానించదగిన పరిణామమే. అయితే ఎక్కడ పడితే అక్కడ కాకుండా శుచి, శుభ్రత పాటించే వారి వద్ద అల్పాహారాలు చేయడం మంచిది. నగరంలో చిరుతిళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక్కో చోట ఒక్కో రకమైన పదార్థాలు లభిస్తుంటాయి. రెండు నెలల తర్వాత వీటి నిర్వహణకు అనుమతి లభించింది. చాలావరకు ఫుడ్ ట్రాక్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పానీపూరి బండ్లు, మిర్చీ బజ్జీలు వేసే బండ్లు రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌ల మీద, చెత్తకుప్పల పక్కన కనిపిస్తున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ ఇవేమీ పట్టించుకోకుండా చాలా మంది అక్కడ ఆహారాన్ని ఒక పట్టు పట్టిస్తుండడం అటు వారికే కాక ఇతరులకు ముప్పు తెచ్చిపెడుతోంది.
మద్యం దుకాణాల వద్ద..?
మద్యం దుకాణాల వద్ద నిర్వహించే చిరుతిళ్ల స్టాళ్లు చూస్తే వణుకు పుడుతోంది. మందుబాబులు మద్యం కొనుగోలు చేసిన అనంతరం వీటి వద్ద గుమిగూడుతున్నారు. ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదు. మురికి వాతావరణం ఉన్నా పట్టించుకోకుండా ఆహారాన్ని తీసుకెళ్తున్నారు.
నిబంధనలు గాలికి...
రెస్టారెంట్లు, హోటళ్లు తెరవడానికి అనుమతిస్తూనే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటేనే నిర్వహించుకోవచ్చని తెలిపింది. రెస్టారెంట్లు, హోటళ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, వంట చేసేవారికి, వడ్డించే సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజులు, సింగిల్ కాంటాక్ట్ సిస్టమ్, టేబుళ్ల మధ్య 6 అడుగుల దూరం, వాడిపడేసే కంచాలు, గ్లాసులు ఉండాలని ఆంక్షలు విధించింది. కొన్ని చోట్ల ఇవేమీ కనిపించడం లేదు.