తమ కష్టార్జితాన్ని దీర్ఘకాలానికి భూములు, స్థలాలపై పెడుతున్నారు. ఇదివరకే కొన్నవారు ఇప్పుడు ఆ స్థలాల్లో కలల ఇంటిని నిర్మించుకుంటున్నారు. మరికొందరు విక్రయించి గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. గృహ రుణాలతో కలల ఇంటిని కొనుగోలు చేసి భరోసాగా ఉంటున్నారు. వీరి బాటలోనే మిగతా వాళ్ల ఆలోచనలు సాగుతున్నాయి. చాలా అవకాశాలు వచ్చినా కొనలేదని.. ఇప్పుడేమో ధరలు పెరిగాయని మరికొందరు వాపోతున్నారు. ఇప్పటికీ కొనొచ్చు అని అని స్థిరాస్తి రంగ నిపుణులు అంటున్నారు. మున్ముందు స్థిరాస్తుల ధరలు పెరగడమే తప్ప తగ్గవని.. దూరంగానైనా భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉండి అందుబాటు ధరల్లో ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. భవిష్యత్తులో భూములు, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సొంతిల్లు కొనేందుకు ఇదే అనువైన సమయం అంటున్నారు.
నలువైపులా నిర్మాణాలు
హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ చూస్తే పశ్చిమ హైదరాబాద్ మొదటి నుంచి దూసుకెళుతోంది. ఈ కేంద్రానికి నలువైపులా మార్కెట్ విస్తరిస్తోంది. కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి దాటి బాచుపల్లి, పటాన్‌చెరు, అమీన్‌పూర్ వరకు నివాస కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ బహళ అంతస్తుల ఆకాశహార్మ్యాలు, విల్లా ప్రాజెక్ట్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మరోవైపు కొల్లూరు నుంచి శంకర్‌పల్లి వరకు స్థలాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ ఇప్పుడిప్పుడే అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. ఇంకోవైపు నార్సింగి, అప్పా కూడలి దాటి కిస్మత్‌పూర్, శంషాబాద్ వైపు నివాసాలు విస్తరిస్తున్నాయి. వ్యక్తిగత గృహాలతో పాటూ విల్లా ప్రాజెక్ట్‌లు, అపార్ట్‌మెంట్లు ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి. ఈ మార్గంలో మెట్రో రెండోదశ విస్తరణ ఉండటంతో భవిష్యత్తులో మరింత వృద్ధికి అవకాశం ఉంటుందని నిర్మాణదారులు చెబుతున్నారు. కొత్త టౌన్‌షిప్‌లు ఈ మార్గంలోనే రాబోతున్నాయి.
- గ్రిడ్ పాలసీతో ఉత్తర హైదరాబాద్ కొంపల్లి నుంచి మేడ్చల్ వైపు, తూర్పు హైదరాబాద్ ఉప్పల్, ఘట్‌కేసర్.. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్, సాగర్ హైవే, ఆదిభట్ల వరకు, దక్షిణంలో విమానాశ్రయం చేరువలో రాజేంద్రనగర్, శంషాబాద్, తుక్కుగూడ వరకు నగరం విస్తరించడంతో ఇక్కడ స్థిరాస్తి లావాదేవీలు ఊపందుకున్నాయి. ఈ ప్రాంతాల్లో వృక్తిగత ఇళ్లతో పాటూ బహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి. విస్తీర్ణం, సౌకర్యాలను బట్టి ధరలు ఉన్నాయి.
- శివార్లలో అత్యధిక ప్రాంతాల్లో ఇంటి ధరలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వీటిలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. అయినా ధరలు అందుబాటులోనే ఉన్నాయని బిల్డర్లు అంటున్నారు. బాచుపల్లి, చందానగర్, దమ్మాయిగూడ, గాజుల రామారం, అత్తాపూర్, కిస్మత్‌పూర్, కొంపల్లి, నాగోల్, బండ్లగూడ, సైనిక్‌పురి, యాప్రాల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఆధిభట్ల, తుక్కుగూడ, కొల్లూరు వరకు చిన్న అపార్ట్‌మెంట్ మొదలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ చాలావరకు అందుబాటులో ఉన్నాయి.
- ఇన్నర్ రింగ్ నుంచి అవుటర్ రింగ్ మధ్య మాత్రమే భూముల లభ్యత ఉండటంతో ఇక్కడే ఎక్కువ స్థిరాస్తి ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. స్థలాల వెంచర్లు పరిమితంగా ఉండగా ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీలు వస్తున్నాయి. ఇవన్నీ అవుటర్‌కు చేరువగా ఉన్నాయి.
- అవుటర్ నుంచి బయటివైపు 20 కి.మీ. వరకు ప్లాటింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అవుటర్‌కి 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం ఎక్కువగా ఫామ్ ల్యాండ్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. గుంటల లెక్కల వీటిని విక్రయిస్తున్నారు. వంద, రెండు వందల ఎకరాలు తీసుకుని అర ఎకరా, ఎకరా రిజిస్ట్రేషన్ చేస్తూ అక్కడే సామూహిక వ్యవసాయం చేస్తున్న ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. భవిష్యత్తు కోసం ఎక్కువగా వీటిలో పెట్టుబడి పెడుతున్నారు.
హైవేల వెంట వేగంగా..
- నగరంలో ఏ మూల తీసుకున్నా స్థలాలు, ఫ్లాట్ల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. కొవిడ్‌కు ముందు ఇప్పటికీ చాలాచోట్ల ధరల్లో దిద్దుబాటు జరిగింది. ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలనుకునే వారికి హైవేల మార్గాలు అనుకూలంగా కన్పిస్తున్నాయి.
- వరంగల్ హైవే మార్గంలో ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం.. ఐటీ కంపెనీలు విస్తరణ చేపడుతుండటంతో ఎక్కువ మందిని ఈ మార్గం ఆకర్షిస్తోంది. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పటికే నగరం ఘట్‌కేసర్ వరకు విస్తరించింది.
- నాగార్జున సాగర్ హైవే మార్గంలో ఏరో సెజ్‌లు.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఫార్మా సిటీకి చేరువగా ఉండటం, పెద్ద ఎత్తున విద్యా సంస్థల ఉండటంతో వృద్ధికి అవకాశం ఉంటుందని కొనుగోలుదారులు ఇటువైపు చూస్తున్నారు.
- శ్రీశైలం రహదారిలో ఔషధ నగరి ఏర్పాట్లతో ఇక్కడ మార్కెట్ పుంజుకుంది. కందుకూరు, కడ్తాల్ దాటి ఆమన్‌గల్లు వరకు వెంచర్లు వెలిశాయి. పలు కొత్త వెంచర్లు ప్రారంభించబోతున్నారు. ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భవిష్యత్తు దృష్ట్యా కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
- బెంగళూరు జాతీయ రహదారి ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, కొత్తగా వేర్‌హౌస్‌ల నిర్మాణంతో ఇక్కడ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. కొత్తూరు, షాద్‌నగర్ దాటి జడ్చర్ల వరకు విస్తరించింది. ఫామ్‌ల్యాండ్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి.
- నాగ్‌పూర్ జాతీయ రహదారి, మేడ్చల్ సిటీకి దూరమైనా.. అవుటర్‌పైనుంచి ఐటీ కేంద్రానికి అరగంట ప్రయాణం కావడం.. ప్రశాంత వాతావరణం ఉండటంతో విల్లా ప్రాజెక్ట్‌లు మొదట ఇక్కడ ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం అపార్ట్‌మెంట్ల నిర్మాణం పెరిగింది. బడా సంస్థలు తమ ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తుండటంతో క్రమంగా ఇటువైపు కొనుగోలుదారుల దృష్టి పడింది.
- పాత ముంబయి రహదారిలోనూ సిటీకి 50 కి.మీ. సంగారెడ్డి వరకు స్థిరాస్తి మార్కెట్ విస్తరించింది. ఐఐటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు ఉండటం, ఐటీ కేంద్రానికి చేరువలో ఉండటంతో భవిష్యత్తు ఉంటుందని ఇటు చూస్తున్నారు.
అవకాశం చేజారకుండా..
సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చాలామంది స్థిరాస్తి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే.. తాము ఉన్న ప్రాంతంలోనే కొనాలని చూడటం. అప్పటికే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి బడ్జెట్‌లో దొరక్కపోవచ్చు. ఉన్నచోట నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం వెళితే బడ్జెట్‌లో వస్తుంది. భవిష్యత్తులో విలువ పెరుగుతుంది. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో నివాసం ఉంటే అక్కడి స్థలాలు, ఇళ్లు అమ్మకానికి వచ్చే విషయం మీ దృష్టికి వస్తుంది కాబట్టి కొనుగోలు చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి.
- చాలామందికి సిటీకి దూరంగా ఉంటున్న ప్రాంతాల్లో స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు మంచి అవకాశాలు వస్తుంటాయి. అయితే భవిష్యత్తులో తాము అక్కడ ఉండమనే కారణంతో వాటిపై పెద్దగా ఆలోచించరు. మీరు అక్కడ తాత్కాలికంగా ఉంటున్నా.. స్థిరాస్తిలో మదుపు అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. వెళ్లేటప్పుడు అమ్మేసి మరోచోట కొనుగోలు చేయవచ్చు.
- స్థిరాస్తి కొనడంలో జాప్యం చేస్తే ఆ మేరకు ప్రయోజనాలను కోల్పోతారు. ఒకటి వద్దనుకుంటే మరోటి కొనడానికి సిద్ధపడాలి. భూముల పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకోకుండా కొనుగోలులో తొందరపడవద్దు. ‘తాము దాచుకున్న, పొదుపు చేసిన మొత్తానికి పరిమిత స్థాయిలో కొంత అప్పు చేసి కూడా స్థలాలు, భూములు కొనుగోలు చేయవచ్చు. అప్పుపై కట్టే వడ్డీ కంటే కొన్నిసార్లు ఎన్నోరెట్లు ఎక్కువగా భూముల ధరలు పెరగడం మన కళ్లముందే చూశాం. గృహ రుణాల వడ్డీ రేట్లు అతి తక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో పెరిగే ద్రవ్యోల్బణంతో పోలిస్తే చెల్లించే వడ్డీ తక్కువే. మరో ఆలోచన చేయకుండా కలల స్తిరాస్తిని కొనుగోలు చేయవచ్చు’ అని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్స్ కౌన్సిల్ (ఐజీబీసీ) హైదరాబాద్ ఛాప్టర్ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి సూచించారు.
ఎందుకు ఇప్పుడే?
- గృహరుణ వడ్డీ రేట్లు 6.80 శాతానికి దిగిరావడం.
- కొవిడ్‌తో ఏడాది పాటూ స్తంభించిన మార్కెట్.. మున్ముందు పెరుగుతుందని అంచనాలు.
- భూముల లభ్యత తగ్గుతుండటంతో పెరుగుతున్న డిమాండ్.
- రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న విదేశీ సంస్థలు.