ప్రతి మెట్రోస్టేషన్(metro station) రెండు ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలతో సమానమన్నారు.. రద్దీగా ఉండే రహదారిని దాటాలంటే మెట్రో ప్రవేశ మార్గాలనే ఉపయోగించాలని చెప్పారు.. ఇప్పుడేమో వాటిని మూసేశారు. దీంతో రైలు దిగిన ప్రయాణికులు, రోడ్డు దాటేందుకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అడిగితే ప్రభుత్వ ఆదేశాలంటున్నారు. విసిగిపోయిన నగరవాసులు మంత్రి కేటీఆర్(minister ktr)కు ఫిర్యాదు చేశారు. మెట్రోరైలు స్టేషన్(hyderabad metro)కు నాలుగువైపులా మెట్ల మార్గం, లిఫ్ట్, ఎస్కలేటర్లను తెరిచేలా చూడాలని కోరుతున్నారు. దాదాపు చాలా స్టేషన్లలో ఇదే పరిస్థితి. కొవిడ్‌తో మూతపడిన మెట్రోరైలు ప్రవేశమార్గాలు కొన్ని ఇప్పటికీ తెరచుకోలేదు.
రద్దీ స్టేషన్లలో సైతం..
మెట్రో దిగిన ప్రయాణికులు రహదారిపైకి వచ్చి రోడ్డు దాటకుండా మొదటి అంతస్తులోనే ఏవైపు కావాలంటే ఆ వైపు వెళ్లేలా దిగేలా డిజైన్ చేశారు. ప్రయాణికులే కాదు సాధారణ ప్రజలు సైతం రోడ్డు దాటేందుకు మెట్రో మొదటి అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి రెండోవైపు దిగవచ్ఛు కొవిడ్ సమయంలో ప్రయాణికులు తగ్గారని.. నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు ఎ, బి, సి, డి మార్గాల్లో రెండింటినే అధికారులు తెరుస్తున్నారు. ప్రయాణికుల సందడి పెద్దగా లేని స్టేషన్లే కాదు రద్దీగా ఉండే స్టేషన్లు, కూడళ్లలో స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి.
- ఉప్పల్‌లో ఏ, డీ మార్గాలనే తెరిచారు. తార్నాకలోనూ రెండు మార్గాల షటర్లు వేసే ఉంటున్నాయి.
- రద్దీగా ఉండే లక్డీకాపూల్ స్టేషన్‌లోనూ సీ గేటు ఎస్కలేటర్, లిఫ్ట్ మూసే ఉంటున్నాయి. ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్, డీజీపీ, ఇతర కార్యాలయాలున్నాయి.
- ప్యారడైజ్ స్టేషన్‌లో ప్రయాణికులు ఫైర్‌స్టేషన్ వైపు స్కైబ్రిడ్జి మీదుగా రోడ్డు దాటేవారు. ఒకవైపు మూసి ఉండటంతో రహదారి మీదుగా ప్రమాదకరంగా దాటుతున్నారు. ఎక్కువ మంది ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రెండువైపు మార్గాలను తెర్చినట్లు సిబ్బంది చెప్పారు.
- మధురానగర్‌లోని తరుణి మెట్రోస్టేషన్, మూసాపేట, భరత్‌నగర్, బాలానగర్ స్టేషన్లలోనూ మరోవైపు మార్గాలను తెరవనేలేదు.
- దుర్గం చెరువు మెట్రోస్టేషన్ సైతం ఒకవైపే తెరిచారు.
గంట ముందే నడపండి
కారిడార్-1లో ఉదయం, సాయంత్రం మెట్రోరైళ్లు కిక్కిరిసి వెళ్తున్నాయి. లక్షకుపైగానే రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారని మెట్రో వర్గాలు అంటున్నాయి. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో రద్దీవేళల్లో 5 నిమిషాలకో మెట్రో నడుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. మొదటి మెట్రోరైలు మియాపూర్, ఎల్‌బీనగర్, నాగోల్, రాయదుర్గంలో ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది. అయితే తొలి మెట్రోను 6 గంటలకే ప్రారంభిస్తే ఉపయోగకరంగా ఉంటుందని అని ప్రయాణికులు మెట్రోరైలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా 6,457 పంచాయతీలకు సొంత భవనాల్లేవ్!