MLA Rajasingh PD ACT Case Updates: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమర్థించింది. పీడీ యాక్టు కేసు కొట్టివేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు తిరస్కరించింది. తనపై అక్రమంగా నమోదు చేసిన పీడీ యాక్టును తొలగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన ఎమ్మెల్యే.. తనపై కక్షపూరితంగా పీడీ యాక్టు కేసు నమోదు చేశారని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నందున కక్షతో పీడీ యాక్టు ప్రయోగించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.
రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, కొన్ని వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యహరించడం వల్లే పీడీ యాక్టు ప్రయోగించామని వివరించారు. గతంలో అతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను బోర్డు ముందుంచారు. ఇరువర్గాల వాదనలు విన్న అడ్వైజరీ బోర్డు .. పీడీ యాక్టును కక్షపూరితంగా ప్రయోగించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడింది. పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని సమర్థించింది. దీనిపై రాజాసింగ్ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం.
అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడీషీట్ తెరిచారు. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటుచేసుకునేలా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఓ వర్గాన్ని కించపరిచేలా పెట్టిన వీడియో శాంతిభద్రలకు విఘాతం కలిగించిందని పేర్కొన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. 18 కమ్యూనల్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
ఇవీ చదవండి: