Revanth Reddy Will Appear Before SIT Today: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హిమాయత్‌నగర్‌లోని సిట్ ఎదుట హాజరయ్యారు. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పేపర్ల లీకేజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. మల్యాల మండలంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ లో వందకు పైగా మార్కులు వచ్చిన వారు చాలా మంది ఉన్నారని విమర్శించారు.
దీంతో లీకేజీ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు విపక్ష నేతలు చేస్తున్న ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించి.. రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు నోటీసులు ఇచ్చారు. వారిద్దరు చేసిన ఆరోపణలకు సంబంధించిన వివరాలు తమకివ్వాలని సిట్ ఇచ్చిన నోటిసుల్లో స్పష్టం చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి, రేపు బండి సంజయ్ సిట్ ఎదుట హాజరై వివరాలు ఇవ్వాలని సూచించింది. అందులో భాగంగా ఇవాళ సిట్ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి.. పేపర్ లీకేజీకి సంబంధించిన వివరాలను సిట్‌కు అందజేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Revanth Reddy on TSPSC Paper Leakage: మరోవైపు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సిట్ ముందుకు వెళ్తున్న సందర్భంగా.. రేవంత్‌రెడ్డి తమ పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయం వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.. మల్లు రవి, అద్దంకి దయాకర్, హనుమంతరావులను గృహ నిర్బంధం చేశారు.
ఈ అరెస్టులపై రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నిరసనలను అణచి వేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. దిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నేతల హైడ్రామాను చూశామని.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి.. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అంతకుముందు రేవంత్‌రెడ్డి భారీ ర్యాలీగా సిట్ కార్యాలయానికి చేరుకోగా.. కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయంలోనికి రేవంత్‌ను మాత్రమే అనుమతించిన పోలీసులు.. మిగతా వారిని అడ్డుకోవడంతో కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్‌కి రానున్న మాణిక్రాలు ఠాక్రే: ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే నాలుగు రోజుల పర్యటన నిమిత్తం.. ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఉదయం 11 గంటలకు ఠాక్రే హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా.. సాయంత్రం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులతో సమావేశం అవుతారు. పాదయాత్ర చేస్తున్న ఇద్దర్ని హైదరాబాద్ పిలిపించి సమావేశం అవుతుండడం చూస్తుంటే అజెండాపై స్పష్టత లేకపోయినా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న నేపథ్యంలో పార్టీ పరంగా దానిని ఎలా ముందుకు తీసుకెళ్లి పార్టీ వైపు మలచుకోవాలన్న అంశమే ప్రధానమని సమాచారం. 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫిషరీస్ కాంగ్రెస్ నేతలతో ఠాక్రే భేటీ అవుతారు. అనంతరం సాయంత్రం యువజన కాంగ్రెస్ నాయకులతో సమావేశమై చర్చిస్తారు. 25 ఉదయం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం, సాయంత్రం వీహెచ్ నిర్వహిస్తోన్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. 26వ తేదీ ఖమ్మంలో మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రలో పాల్గొంటారు. 27వ తేదీ పర్యటన ముగించుకుని నాగపూర్ పయనమవుతారు.
ఇవీ చదవండి: