Revanth Reddy respond to Talasani Srinivasa Yadav comments : పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తనపై ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయాలను అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. తనతో ఎదురుగా వచ్చి మాట్లాడితే.. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు.
నాయకులపై చేసిన వ్యాఖ్యలకు ఆవేదన చెందాను: ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాతనంగా వ్యవహరించాలని మంత్రులు, ఎమ్మెల్యేల గురించి అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతలపై అసభ్యకర భాషతో చేసిన విమర్శలతో ఆయన ఆవేదన చెందారని చెప్పారు.
బాధ్యత కలిగిన మంత్రిగా తాను ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీలు వేరైనా విమర్శలు అర్థవంతంగా ఉండాలని.. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరికాదని మంత్రి అన్నారు. ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. విమర్శకు ప్రతి విమర్శ అంతే కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు.
నేను ఒక పార్టీ అధ్యక్షుడిని.. ఆ విషయం గుర్తు పెట్టుకుని వ్యాఖ్యలు చేయడం మంచిది. నా గురించి మాట్లాడితే అంతా గౌరవంగా ఉండదు. రాజకీయ నాయకులుగా మనం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కంటోన్మెంట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ పరిధిలో ఉన్న అన్ని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాం. వాటిని అధికారులు పరిష్కారిస్తారని తెలిపారు.- రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు
కంటోన్మెంట్ సమస్యలపై చర్చ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశానికి మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై చర్చించామని, కంటోన్మెంట్ సివరేజి వ్యవస్థ సరిగా లేదని అన్నారు. కంటోన్మెంట్‌లో రహదారుల మూసివేత, నాలా సమస్యలు, కలుషిత నీటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి.. పరిష్కారానికి ప్రతిపాదనలు చేశారని తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహంతో పాటు నంది ఎల్లయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: