రాష్ట్రంలో తరచూ జరుగుతున్న మిస్సింగ్ కేసులపై పోలీసులు తక్షణమే స్పందించేట్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రోజురోజుకీ పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు తనను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
గత నెల 30 నాటికే 200 మంది మిస్ అయ్యినట్లు పోలీసు శాఖ అధికారిక వెబ్‌సైట్లు వెల్లడి చేసినట్లు మీడియాలో వార్తలొచ్చాయన్నారు. ఒకే రోజున ఏకంగా 65 మంది తప్పిపోయినట్లు రికార్డవడం దిగ్భ్రాంతికి గురిచేసినట్లు తెలిపారు. ఈ పరిణామాలు తెలంగాణ సమాజంలో కలవరానికి దారి తీయక ముందే ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మిస్సింగ్ కేసుల్లో కొన్ని వ్యక్తిగతం, కుటుంబ సంబంధ కారణాలున్నప్పటికీ అత్యధిక కేసులు నేరపూరిత కోణాలు ఉంటాయని పేర్కొన్నారు. మాటలతో చెప్పలేని రీతిలో పసి మొగ్గల్ని, బాలికల్ని, మహిళల్ని హింసించి బలి తీసుకుంటున్న వ్యథలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన ఆకృత్యాలు జరిగేవరకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి... ఎన్‌కౌంటర్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండకూడదని ఆమె పేర్కొన్నారు.
మిస్సింగ్ కేసులను తీవ్రంగా పరిగణించి...కేసు నమోదవగానే పోలీస్ శాఖ స్పందించేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే... జరగబోవు ఘోరాల్ని అరికట్టి బాధితుల్ని కాపాడే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండిః 'అదృశ్యం కేసులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు?'