స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా అధికార తెరాస రిసార్టు రాజకీయాలు చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అక్కడ బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థిని అనర్హురాలిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ అభ్యర్థి సుభాష్‌రెడ్డిలతో కలిసి సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి రిసార్టుల్లో బందీలుగా ఉంచారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల అధికారులు నిఘా బృందాలను నిజామాబాద్‌కు పంపి తనిఖీలు నిర్వహించాలని కోరారు.
నేడు దుబ్బాక అభ్యర్థి ప్రకటన
దుబ్బాక అభ్యర్థిని మంగళవారం ప్రకటిస్తామని ఉత్తమ్ తెలిపారు. మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించలేదు. కాగా ఈ ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్‌లకు అప్పగించారు. ముఖ్య సమన్వయకర్తగా ఎం.నగేష్ ముదిరాజ్, పోలీసు శాఖ వ్యవహారాలను చూసేందుకు గూడూరు నారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఎమ్మెల్సీ టికెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో ఉత్తమ్ అధ్యక్షతన సమావేశమయ్యారు.
సత్యాగ్రహ మౌనదీక్ష
హాథ్రస్ ఘటన, పోలీసులు, ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతల పట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ గాంధీభవన్ ఆవరణలో సత్యాగ్రహ మౌన దీక్ష చేపట్టారు. ఉత్తమ్‌తో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, నాయకులు బోసురాజు, కుసుమకుమార్, వీహెచ్, పొన్నాల, షబ్బీర్‌అలీ, దామోదర, గీతారెడ్డి, గూడూరు, అంజన్‌కుమార్ పాల్గొన్నారు.