పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం నుంచే కేసీఆర్‌పై దండయాత్ర మొదలవుతుందని కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని రేణుకా చౌదరి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ రాజకీయ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్ర పీసీసీ నూతన కమిటీలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారని రేణుకా చౌదరి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతామని తనకు చాలా ఫోన్‌లు వస్తున్నట్లు చెప్పారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వారి కోసం పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
ఈ నూతన కమిటీ కాంగ్రెస్ స్వార్థానికి వేసింది కాదని.. రాష్ట్ర ప్రజల కోసం వేసిందని ఆమె అన్నారు. పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ప్రధాని మోదీ వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల గురించి మరో ఆలోచన చేయకుండా పెంచేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ బాధ్యతలు తెలిసిన ప్రధాని అయితే.. నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే వచ్చే ఇబ్బందేంటో తెలిసేదని ధ్వజమెత్తారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: REVANTH REDDY: అలాంటి వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి: రేవంత్ రెడ్డి