Revanth Reddy Interview: తెలంగాణ సమాజానికి తెరాస ప్రమాదకరంగా మారిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల్ని ఆత్మగౌరవంతో బతికేలా చేయాల్సిన ప్రభుత్వం దాన్ని విస్మరించి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులను కల్పిస్తోందని ఆరోపించారు. హనుమకొండ వేదికగా 2023 ఎన్నికల పోరాట కార్యాచరణకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతోందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హనుమకొండలో జరిగే రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలో తెరాస శకం ముగిసిందని.. రాబోయే శకం కాంగ్రెస్ పార్టీదేనని రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో ఈటీవీభారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినా.. అనుమతించకున్నా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాహుల్‌గాంధీ వెళ్లడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారు. అది ప్రమాదం అంచున ఉంది. వ్యవసాయాన్ని కాపాడుకోవడం ద్వారా తెలంగాణ సమాజాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రైతు ఆత్మగౌరవంతో బతికేందుకు కావాల్సిన అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాం. హనుమకొండ వేదికగా వ్యవసాయ విధానం ప్రకటిస్తాం. రుణమాఫీ, గిట్టుబాటు ధర, పంటలకు బీమాపై ప్రధానంగా దృష్టి పెడతాం. ప్రభుత్వంపై పోరాటం చేసి రైతులకు విశ్వాసం కల్పించేలా గిట్టుబాటు ధర ఇప్పించాలన్నదే కాంగ్రెస్ ఆలోచన.
వ్యవసాయం కాంగ్రెస్ తొలి ఎజెండాగా ఎందుకు మారింది?
ఎనిమిదేళ్ల తెరాస పాలనలో తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. 8,400 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2018-22 మధ్య 74 వేల మందికి రైతుబీమా పథకం వర్తింపచేశామని ప్రభుత్వ ప్రకటనలే చెబుతున్నాయి. రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వలేదు. రుణమాఫీ చేయలేదు. కనీస మద్దతు ధరకు పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇందులో భాజపా పాత్ర కూడా ఉంది. గల్లీలో ధాన్యం కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం దిల్లీకి పోతోంది. దిల్లీలో గిట్టుబాటు ధర ఇప్పించి రైతును కాపాడాల్సిన భాజపా ప్రతినిధులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారు. పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తే రైతులు ఆత్మగౌరవంతో బతుకుతారు. అందుకోసమే మా పోరాటం.
2023 ఎన్నికల దిశగా కాంగ్రెస్ కార్యాచరణ ప్రారంభమైందా?
నూటికి నూరు శాతం. తెలంగాణలో 12 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణలో మొదటి ఎజెండాగా రైతులు, వారికి సంబంధించిన అంశాలతో బహిరంగసభ నిర్వహించి పోరాట కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నాం. తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యలను వరుసగా చేపడతాం. ప్రతి రెండు, రెండున్నర నెలలకు రాష్ట్రానికి రాహుల్‌గాంధీ వచ్చి మా విధానాలను ప్రకటించడం ద్వారా ప్రజల మద్దతు కూడగట్టబోతున్నాం. తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యానికి వేలమంది రైతులు, విద్యార్థులు బలయ్యారు. దాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చింది. రాష్ట్రంలో తెరాస శకం ముగిసిపోయింది. రాబోయే శకం కాంగ్రెస్ పార్టీది. పదేళ్లు అధికారంలో ఉంటుంది.
రాహుల్‌గాంధీ కార్యక్రమం ఎలా సాగనుంది?
వరంగల్ ప్రాంతంలో మూడు దశాబ్దాల్లో ఇప్పటివరకు ఏ సభ జరగని విధంగా సభ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తరలివస్తారు. రాహుల్‌గాంధీ వారిని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి భరోసా కల్పిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే వ్యవసాయ విధానాన్ని సభలో ప్రకటిస్తారు.
కాంగ్రెస్‌లో విభేదాలపై మీ అభిప్రాయం?
పార్టీలో ఉన్నవి విభేదాలు కాదు.. భిన్నాభిప్రాయాలు. వాటిని చర్చించుకుని పరిష్కరించుకుంటాం. తెరాస వైఫల్యాలపై కలసికట్టుగా పోరాడతాం.
రాష్ట్రంలో భాజపా తన కార్యక్రమాల్లో వేగం పెంచింది? దీనిపై మీ అభిప్రాయం?
తెరాస, భాజపా మధ్య ఉన్న అవగాహన మేరకే ఇదంతా జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి భాజపా కొంత ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రం మొత్తం మీద ఉన్న పార్టీలు తెరాస, కాంగ్రెస్ మాత్రమే. రెండింటికీ ఒకే రకమైన ఓటింగ్ విధానం ఉంది. గతంలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు తర్వాత తెరాస వైపు మొగ్గింది. అది మళ్లీ కాంగ్రెస్ వైపు వస్తోంది. ఈ భయంతోనే కాంగ్రెస్‌ను తెరాస తక్కువ చేసి.. భాజపాతో గట్టిగా కొట్లాడుతున్నట్లు చూపుతోంది.
ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి జరుగుతుందా?
తెలంగాణ ఉద్యమం సహా అనేక సామాజిక ఉద్యమాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పుట్టినిల్లు. విద్యార్థులతో రాహుల్‌గాంధీ నేరుగా మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకుని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలనుకుంటున్నారు. ఓయూకు ఆయన రాకపై ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో తెలియడం లేదు. అక్కడికి రాహుల్‌గాంధీ వెళ్లడం మాత్రం ఖాయం.
ఇవీ చదవండి: