పేదల కష్టసుఖాలు తెలుసుకునేందుకు రాజీవ్‌గాంధీ యాత్ర చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy comments) అన్నారు. హిందూ, ముస్లింలు దేశానికి రెండు కళ్లు అని రాజీవ్ చెప్పారని గుర్తు చేశారు. నేడు అధికారం కోసం కొందరు రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర(Rajiv Gandhi sadbhavana sabha 2021) స్మారక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో రేవంత్ పేర్కొన్నారు.
ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకొని ప్రజాజీవితంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ... ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి కృషి చేశారు. ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కులాల ప్రాతిపదికన.. మతాల ప్రాతిపదికన విభజించి తమ పార్టీలు విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడానికి మహాత్మగాంధీ జయంతి అక్టోబర్ 2, 1990లో దిల్లీలో ఈ సద్భావన యాత్రను మొదలుపెట్టారు. పేద ప్రజల కష్టసుఖాలు తెలియాలని, ఈ దేశంలో ఉండే భిన్న వర్గాలను కలవాలని రెండో తరగతి రైలు ప్రయాణం చేశారు. అక్టోబర్ 19న హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఈ చార్మినార్ కులీకుతుబ్‌షాహీల నుంచి మొదలుపెడితే ఈనాటి వరకు ఒక నిషాన్. ఒకపక్కన భాగ్యలక్ష్మి మందిరం, ఇంకోవైపు మక్కా మసీద్... హిందూ ముస్లింలు ఈ దేశానికి రెండు కళ్లు.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సర్వమత ప్రార్థనల్లో కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేలాది, లక్షలాది మంది హిందూముస్లింలు అసువులు బాసి... ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. ఈ దేశ సమగ్రత కోసం లక్షలాది మంది ప్రాణాలర్పించి స్వాతంత్య్రం తీసుకొస్తే.. ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు ప్రాంతాల ముసుగులో, మతాల ముసుగులో చిచ్చుపెట్టి పార్టీని విస్తరించుకొని, అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేస్తున్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది. 4శాతం రిజర్వేషన్ల తోటి వేలాది మంది మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవుతున్నారంటే... ఆ నాటి కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇదీ చదవండి: Telangana Minister KTR : కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారనే విషయంపై కేటీఆర్ క్లారిటీ