మహ్మద్ అజహరుద్దీన్ పాలనలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పే అండ్ ప్లేగా మారిపోయిందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌యాదవ్.. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్ అయూబ్, జి.వినోద్ ఆరోపించారు. ఆటగాళ్ల నుంచి ఒక్కో మ్యాచ్‌కు రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్నాడని విమర్శించారు. సెప్టెంబరు 26న అజహర్ పదవీకాలం ముగిసినా కుర్చీ వదలడం లేదని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో శివలాల్, అర్షద్, వినోద్.. హెచ్‌సీఏ మాజీ కార్యదర్శులు శేష్‌నారాయణ, జాన్ మనోజ్ ఆగ్రహం వ్యక్తంజేశారు.
‘‘గత మూడేళ్లలో హెచ్‌సీఏ ప్రతిష్ఠ పూర్తిగా దిగజారింది. అండర్-14, 16, 19, 22 సీనియర్ జట్లలో ఆటగాళ్ల ఎంపిక వ్యాపారమయమైంది. ఒక్కో మ్యాచ్‌కు రూ.15 లక్షలు తీసుకుంటున్నారు. వయోపరిమితి ధ్రువీకరణ పత్రం కోసం రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 15 మందిని జట్టుకు ఎంపిక చేయాల్సి ఉండగా.. 30 మంది ఆటగాళ్లను టోర్నీలకు పంపిస్తున్నారు. హెచ్‌సీఏలో అవకతవకల గురించి సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ ఛైర్మన్ జస్టిస్ కక్రూ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక నూటికి నూరు శాతం నిజం.
అత్యంత అవినీతిపరుడు అజహర్.. జస్టిస్ కక్రూపై విరుద్ధ ప్రయోజనాలంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నాడు. తనకు వ్యతిరేకంగా నిర్వహించే సమావేశాలకు వెళ్లొద్దంటూ క్లబ్‌ల కార్యదర్శులను అజహర్ బెదిరిస్తున్నాడు. పర్యవేక్షక కమిటీలోని వంకా ప్రతాప్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన వర్తించదా? హెచ్‌సీఏ అకాడమీ డైరెక్టర్‌గా ఉంటాడు.. ఆయన కూతురు హైదరాబాద్ జట్టుకు ఆడుతుంది.. పర్యవేక్షక కమిటీలోనూ ఉంటాడు.
ఇదెలా సాధ్యం? పర్యవేక్షక కమిటీని ప్రతాప్ తప్పుదోవ పట్టిస్తున్నాడు. సెప్టెంబరు 26న అజహర్ పదవీ కాలం పూర్తయింది. నిబంధనల ప్రకారం ఏజీఎం నిర్వహించి.. ఎన్నికల తేదీని ప్రకటించాలి. ఇలాంటి సందర్భంలో క్లబ్‌ల కార్యదర్శులు ప్రత్యేక ఏజీఎం నిర్వహించొచ్చని హెచ్‌సీఏ నియమావళి చెబుతుంది. నెలన్నర క్రితమే మేం సమావేశం నిర్వహించాం.
డిసెంబరు 11న ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక ఏజీఎం నిర్వహించి ఎన్నికల తేదీ, రిటర్నింగ్ అధికారిని ప్రకటిస్తాం. ఇదే విషయాన్ని పర్యవేక్షక కమిటీకి తెలియజేశాం. తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్లు, ఎస్పీలతో కొత్త జిల్లాలకు నూతన కార్యవర్గాల్ని ఏర్పాటు చేస్తున్నారు. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులు, బీసీసీఐ నిబంధనలకు ఇది విరుద్ధం. ఆ సంఘాలు చెల్లవు’’ అని వారు ఆరోపించారు.
ఇవీ చదవండి: