Pawan Kalyan Speech about SC ST Sub Plan : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లించకూడదని, సబ్‌ప్లాన్ సంపూర్ణంగా అమలు జరగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. ఇంకా నిధులు ఇవ్వాలని కోరాలా..? అని ప్రశ్నించారు. అన్ని కులాలకు చేయూత అందించాలి.. నమ్ముకున్న వారికి ఏదో ఒకటి చేయాలి కదా అని పేర్కొన్నారు. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే, సామాజిక పునర్నిర్మాణం చేయాలన్నదే నా తపన అని జనసేనాని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదు.. వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో... అంతే ప్రమాదకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వివక్షకు గురైనప్పుడే ఆ బాధ తెలుస్తుందని, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని, వివక్షకు గురయ్యే కులాలను మనం అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలని చెప్తూ.. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలని అన్నారు. జనాభాకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని సూచిస్తూ.. దేహీ అంటే కుదరదు... పోరాటం చేసే తీసుకోవాలి అని పిలుపునిచ్చారు. నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడని, బయటి శత్రువుల కన్నా మనతోటే ఉండే శత్రువులను కనిపెట్టాలని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని తెలిపారు. ఈ మూడేళ్లలో రూ.20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలి? ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ, ఎస్టీల నిధులు వారికి రాకుండా దారిమళ్లించి మోసం చేస్తారా? అని ప్రశ్నించారు. బాధితులకు వచ్చే పరిహారంలో కూడా వాటా అడిగే పరిస్థితి మారాలి. జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించలేని స్థితి మంచిది కాదు. తప్పు చేస్తే నాతో సహా ఎవరినైనా ప్రశ్నించే పరిస్థితి రావాలి.
ఇవీ చదవండి :