అమరావతి రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. వారి కోసం తన ప్రాణాలను అడ్డు వేస్తానని ధైర్యం చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కోసం ఎవరితో అయినా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన ఆయన... అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఏపీ రాజధానిపై అన్ని ప్రాంతాల నేతల అభిప్రాయాలు తీసుకున్నామని... ఈ అంశంపై సబ్ కమిటీ ఏర్పాటు చేశామని పవన్ తెలిపారు. పాలకులు చేసిన తప్పులు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన గాయం మానకముందే... ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే భావితరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
రైతులు కన్నీరు పెడితే పోరాటం చేస్తా..
అమరావతిని ఏపీ రాజధానిగా అన్ని పార్టీలు గతంలో ఒప్పుకున్నాయని పవన్ గుర్తుచేశారు. అంచెలంచెలుగా రాజధాని నగరం నిర్మించుకోవచ్చని వివరించారు. అమరావతికి భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు ఇష్టపడకపోతే... వారి కన్నీటితో రాజధాని నిర్మించవద్దని ఆనాడు ప్రభుత్వానికి చెప్పానని వెల్లడించారు. రైతులు కన్నీరు పెడితే పోరాటం చేస్తానని అప్పుడే స్పష్టంగా చెప్పిన విషయం గుర్తుచేశారు.
అప్పుడు ప్రతిపక్షం కూడా ఒప్పుకుంది కనుకే రైతులు భూములు ఇచ్చారని... ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం సరికాదని హితవు పలికారు. రైతు కన్నీరు పెట్టిన ఏ నేల అయినా బాగుపడదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం ధర్మం తప్పిందని విమర్శించారు. భూములు ఇవ్వడమే రైతులు చేసిన పాపమా...? అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు వీరికి అధికారం ఉందా...? అని నిలదీశారు. కర్నూలులో హైకోర్టు అనడం రాయలసీమ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు.
పరిపాలన ఒక్కచోటు నుంచే జరగాలి..
ఏపీ రాజధానిలో అక్రమాలు జరిగితే విచారణ జరపాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. విశాఖను రాజధాని చేస్తామని సీఎం వచ్చి స్పష్టంగా చెప్పాలన్నారు. పరిపాలన అంతా ఒకేచోట ఉండాలన్న జనసేనాని... విశాఖ, కర్నూలు, అమరావతి ఎక్కడైనా ఒకేచోట రాజధాని ఉంచాలని కోరారు. కడప ఉక్కుపరిశ్రమ కూడా రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడమేనని అభిప్రాయపడ్డారు. కడప ఉక్కుపరిశ్రమకు ప్రధాని, కేంద్రమంత్రులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పాలన ఒకేచోట ఉంచి.. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని కోరారు.