తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాలలో భాగంగా మొదటి రోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు.
అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో ఉత్సవర్లకు స్నపనతిరుమంజనంతో పాటు.. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. పూజల్లో దొర్లిన తప్పులను, దోషాలను నివారించాలని వేడుకుంటూ పవిత్రోత్సవం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించే కైంకర్యాలల్లో తెలిసీ, తెలియక చోటుచేసుకునే దోషాల నివారణకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల నేపథ్యంలో వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తితిదే రద్దుచేసింది. పవిత్రోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: Grand Nursery Mela 2021: ఇవాళ్టి నుంచే జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన