రైలు ప్రయాణమంటే రిజర్వేషన్ దొరక్కుంటే ప్రయాణించలేం. కనీసం నెల ముందు ప్రయత్నిస్తే గానీ బెర్తు దొరకదు. దూరప్రాంతం, రద్దీ ఉండే రూటయితే 2, 3 నెలల ముందే అప్రమత్తం కావాలి. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రైళ్లు, అదనపు బోగీలు వేయలేకపోతున్న రైల్వే.. రిజర్వేషన్ దొరికినవారికైనా సమయానికి గమ్యానికి చేరగలమన్న నమ్మకం లేకుండా చేస్తోంది. సాంకేతిక కారణాల పేరుతో తెలుగురాష్ట్రాలు సహా దేశంలో ప్రధాన మార్గాలకు రాకపోకలు సాగించే వందల రైళ్లను ఎడాపెడా రద్దు చేస్తోంది. ఉన్నపళంగా రైళ్లు రద్దు చేస్తుండటం వల్ల అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం చేసుకోలేక ప్రయాణికులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఇక దారి మళ్లించిన రైళ్లేమో ఐదారు నుంచి పది, పన్నెండు గంటల ఆలస్యంగా గమ్యం చేరుతుండటంతో ప్రయాణికులకు పట్టాలపై చుక్కలు కనిపిస్తున్నాయి.
అటు దిల్లీ, ఇటు ముంబయి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి బయల్దేరేవి, తెలుగురాష్ట్రాల మీదుగా ముంబయి, దిల్లీ వైపు.. దక్షిణమధ్య రైల్వే పరిధిలో గుంతకల్లు-నంద్యాల సెక్షన్‌లో రాకపోకలు సాగించే రైళ్లను రైల్వేశాఖ పెద్దసంఖ్యలో రద్దు చేస్తోంది. మార్చి మొదటివారం వరకు ఇదే పరిస్థితి.
ప్రత్యామ్నాయం ఏదీ?
మధ్య రైల్వే జోన్‌లో వాడి-షోలాపూర్ సెక్షన్‌లో పనుల కారణంగా ముంబయి వైపు వెళ్లే రైళ్లలో ఈనెల 17వ తేదీ నుంచి 16 రైళ్లు పూర్తిగా, 4 పాక్షికంగా రద్దయ్యాయి. మరో 16 రైళ్లను దారిమళ్లించారు. 26 వరకు ఇదే పరిస్థితి. సికింద్రాబాద్ మీదుగా వెళ్లే విశాఖ ఎల్‌టీటీ ముంబయి ఎక్స్‌ప్రెస్‌ను పుణే వరకే పరిమితం చేసిన రైల్వేశాఖ.. అక్కడినుంచి ముంబయికి స్థానిక రైళ్లు వంటి ప్రత్యామ్నాయాల్ని విస్మరించింది. పుణే చేరేది అర్ధరాత్రి 1 గంటకు కావడం వల్ల.. ఆ సమయంలో ప్రయాణికుల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. హైదరాబాద్-ముంబయి మధ్య రాకపోకలు సాగించే 4 రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
- గుంతకల్లు-నంద్యాల సెక్షన్‌లో పనులతో 23 రైళ్లను పూర్తిగా, నాలుగింటిని పాక్షికంగా రద్దుచేశారు. 7 రైళ్లను దారిమళ్లించారు. మార్చి 7 వరకు ఇదే పరిస్థితి.
- వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌ను 4 రోజుల పాటు దారి మళ్లించి నడిపిస్తున్నారు.
- నిజాముద్దీన్-పల్వాన్ సెక్షన్‌లో 4వ లైను పనులతో దిల్లీ మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. 14 డైలీ రైళ్లను 3 నుంచి 5 రోజుల చొప్పున ఫిబ్రవరి 25-మార్చి 1 వరకు పూర్తిగా రద్దుచేశారు. హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లివచ్చేవారికి ఛార్జీలు, ప్రయాణ సమయంపరంగా ఎంతో అనువైన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ 3 రోజుల పాటు రద్దయింది.
టికెట్ల రద్దుకు ప్రయత్నం..
రైళ్ల రద్దు, దారి మళ్లింపు గురించి సమాచారం పంపిస్తున్నామని రైల్వేశాఖ చెబుతున్నా చాలామంది తమకు సంక్షిప్త సందేశాలు అందడం లేదంటున్నారు. దారి మళ్లించే రైళ్లు ఎన్ని గంటలు ఆలస్యంగా వెళ్తాయన్నదానిపై ముందస్తు సమాచారం లేకపోవడంతో టికెట్లు రద్దు చేసుకోవాలా, ప్రయాణం చేసి అవస్థలు పడాలా? అన్న ఆందోళన ప్రయాణికుల్లో వ్యక్తం అవుతోంది.
ముందుచూపు ఎక్కడ?
పలు రూట్లలో కొత్త లైన్ల నిర్మాణం, ఇతరత్రా పనులు జరుగుతున్నాయి. రైల్వేపరంగా ఈ పనులు కీలకమైనవే. ఆ సమయంలో సిగ్నలింగ్ వ్యవస్థను, రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాల్సిందే. కనీసం ఒకట్రెండు నెలల ముందస్తు ప్రణాళిక లేకుండా.. అప్పటికప్పుడు రద్దుచేయడం, దారి మళ్లించడం, ప్రత్యామ్నాయాలు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: ఆతిథ్యం సరే.. మరి ఒప్పందాల మాటేంటి?