దిల్లీలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయని... తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హైదరాబాద్ హిమయత్ నగర్లోని సంఘం కార్యాలయంలో పశ్య పద్మ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
దేశవ్యాప్తంగా రైతులు కొనసాగిస్తున్న పోరాటాలను నీరుగార్చడానికి కొందరు నాయకులు పథకం పన్నారని ఆరోపించారు. అసాంఘిక శక్తులను ప్రేరేపించి ట్రాక్టరు ర్యాలీని ఛిన్నాభిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వ నేతలు, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కుట్ర చేశారని విమర్శించారు.
రద్దు చేయాలి..
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని పద్మ డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లును సైతం ఉపసంహరించాలన్న ఆమె.. పంటలకు మద్దతు ధరలు లభించే చట్టాన్ని తీసుకురావాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పోరాటం కేవలం రైతులదేకాక.. వ్యవసాయ కూలీలు, నిరుపేదలదని అన్నారు. చట్టాలను వెనక్కు తీసుకోకపోతే కేంద్ర పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఐక్యంగా శాంతియుతంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: వ్యక్తిని హత్య చేసి ముఖాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు.!