Party Candidates Campaigning for Opponents : తెలంగాణలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీ తప్పేలా లేదు. ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారే గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఓటు కీలకం కానుంది. ఈ మేరకు బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పట్టణాలు, డివిజన్‌లు, పల్లెలు, గ్రామాల్లోని వార్డులు, మండల, నియోజక వర్గ స్థాయిల్లోని చోటామోటా నాయకుల పాత్ర అత్యంత కీలకంగా మారింది.
ప్రత్యర్థుల కదలికపై పటిష్ఠ నిఘా - గెలుపు కోసం అభ్యర్థుల ఎత్తుగడలు మామూలుగా లేవుగా
Telangana Assembly Elections 2023 : ఆర్థిక ప్రయోజనాలు, సొంత గుర్తింపు కోసం ఈ నేతలు ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ప్రత్యర్థులు ఇస్తామంటున్న తాయిలాలకు లొంగిపోతున్నారు. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తుండటంతో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీలు, అభ్యర్థులకు వెన్నుపోట్లు అధికంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెనక్కి వచ్చిన వారు, కొత్తగా తమతో చేరిన వారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు. కొందరైతే ఒక పార్టీ అభ్యర్థి వెన్నంటి తిరుగుతూ.. ఒంటరిగా ఉన్నప్పుడు మరో పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం వంటి పరిణామాలూ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.
ఎన్నికల సిత్రం - మొన్నటి వరకు స్నేహితులు - కుర్చీ కొట్లాటలో ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులు
వెలుగు చూసిన కొన్ని.. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన జిల్లా స్థాయి నాయకుడు ఒకరు 'అన్నా.. నేను మీ పార్టీలో చేరతా. మీ తరఫున ఊరూరా ప్రచారం చేస్తా. మీరు గెలిచాక నాకు ఏదో ఒక పదవి ఇప్పించండి' అని ఓ పార్టీకి చెందిన కీలక అభ్యర్థిని సంప్రదించాడు. ఇందుకు ఓకే చెప్పిన ఆ అభ్యర్థి 'నువ్వు మా పార్టీలోకి రావాల్సిన పనిలేదు. అక్కడే ఉండి నాకు ఓట్లు పడేలా చేస్తే చాలు.. గెలిచాక నేను నిన్ను చూసుకుంటా' అంటూ హామీతో పాటు సలహా ఇచ్చాడు.
రమ్మనలేరు.. అలాగని దూరం పెట్టలేరు! ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలోని ఒక ముఖ్య నేతకు తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వద్ద మంచి పేరుంది. ప్రచారంలో భాగంగా ఆయన ఉదయం పూట పార్టీ అభ్యర్థి వెంట తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. తిరిగి రాత్రి పూట అదే ప్రాంతానికి వెళ్లి.. తమ పార్టీకి ఓటేయొద్దని చెబుతున్నట్లు తెలియడంతో ఆ అభ్యర్థి ఆ ముఖ్య నేతను పక్కనబెట్టారు.
ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు అభ్యర్థుల వ్యూహం - ఓట్ల చీలికతో రాజకీయ పార్టీల కలవరం
ఉమ్మడి ఓరుగల్లు జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి.. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి వారి అవసరాలు తీర్చే బాధ్యతను పార్టీకి చెందిన, తనకు నమ్మకమైన ఓ ముఖ్య నేతకు అప్పగించారు. ఆ నాయకుడేమో అభ్యర్థి నుంచి అవసరమైన వనరులన్నీ తీసుకున్నాక.. వేరే పార్టీలోకి మారిపోవడంతో చేసేది లేక అభ్యర్థి తల పట్టుకున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ కొత్త అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యంతో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు తమ అనుచరులను అతడి వద్ద చేర్పించారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ అభ్యర్థి తన వ్యూహాల అమలుకు తంటాలు పడుతున్నారు.
తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న స్టార్ క్యాంపెయినర్లు - అభ్యర్థులకు ఎంతవరకు కలిసొచ్చేనో?
అభ్యర్థి గెలుపు కోసం నిత్యం ప్రచారంలో తిరుగుతున్న ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఒకరు.. ఎవరికీ తెలియకుండా కొందరు వ్యాపారవేత్తలను కలుస్తున్నాడు. అభ్యర్థి విజయానికి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయాలంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. అనుమానమొచ్చిన ఓ వ్యాపారవేత్త నేరుగా అభ్యర్థిని ఆరా తీయగా.. నివ్వెరపోవడం అతని వంతైంది.
వలస ఓటర్లపై అభ్యర్థుల స్పెషల్ ఫోకస్ - పోలింగ్ రోజున రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు