Part Time Contract Teachers Protest In Hyderabad : 13 విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న పార్ట్ టైం టీచర్స్‌ను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ.. విశ్వవిద్యాలయాల పార్ట్ టైమ్ టీచర్స్ ఐకాస హైదరాబాద్‌లో వినూత్నంగా నిరసన చేపట్టింది. ర్యాలీగా వచ్చిన టీచర్స్ నాంపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్క్‌లను ధరించి ఆందోళన చేపట్టారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్న తమ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలల్లో పార్ట్ టైమ్ టీచర్స్‌గా పని చేస్తున్న తాము 10 ఏళ్లుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది అధికారులు రెగ్యులర్ చేసే విషయంలో యూజీసీ ఉందని అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని అలాంటి నిబంధనలు ఏమి లేవన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ఏడాది పాటు పని చేస్తున్నా తాము 6 నెలల జీతాలు మాత్రమే తీసుకుంటూ వెట్టిచాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, రెగ్యులర్ టీచర్స్‌తో సరిసమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ.. వేతనాలు పూర్తి స్థాయిలో రాక, ఎలాంటి లబ్ది పొందకుండా తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమబద్ధీరిస్తామని హామీ ఇచ్చారన్నారు.
''ఏళ్ల తరబడి పార్ట్ టైం ఉద్యోగులుగా పని చేస్తున్నాం. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. 13 యూనివర్సిటీల పార్ట్ టైం ఉద్యోగులం ధర్నా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పార్ట్ టైమ్ టీచర్స్ ఆరు నెలల జీతంతోని అర్ధాకలి బతుకులతో జీవితాన్ని వెల్లదీస్తున్నాము. ఈ రాష్ట్రంలో లేదా దేశంలో అత్యున్నతమైనటువంటి పీఎచ్డీ పట్టాలు పొంది ఆరునెల్ల జీతం మాత్రమే తీసుకొని పన్నెండు నెలలు పని చేసే ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యూనివర్సిటీల్లో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్లు మాత్రమే. ప్రతి ఉద్యోగికి కూడా పన్నెండు నెలల జీతాలు ఉంటాయి. పార్ట్ టైం టీచర్లకు 90 రోజులకు ఒక సెమిస్టర్ ఇంకో సెమిస్టర్ ఇలా 180 రోజులకు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. వెట్టి చాకిరీ చేస్తున్నా..సెలవు దినాలకు కూడా జీతాలు కట్ చేసి ఇస్తున్నారు. ఎగ్జామ్‌లు జరిగేటప్పుడు ఇన్విజిలేటర్‌గా మేమే చేస్తున్నాము. ఇలా మేము పడే బాధలను అధికారులకు చెప్పుకున్నా.. చూసీచూడనట్టు ఉంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము.''- విశ్వవిద్యాలయ పార్ట్ టైం టీచర్
Asifabad Gurukula School Students Protest : 'మాకు ఈ ప్రిన్సిపల్ వద్దు అంటే వద్దు'
ABVP Leaders Protest Gangula Kamalakar office : గంగుల కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు