దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్లమెంట్లో ఇవాళ వాడీవేడీ చర్చ జరిగింది. హైదరాబాద్ పశువైద్యురాలు దిశ సహా ఇటీవలి కాలంలో ఆడవారిపై జరుగుతున్న ఆకృత్యాలపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్భయ ఘటన అనంతరం చేపట్టిన చర్యలు విఫలమయ్యాయని.. అందుకు దేశంలో నెలకొన్న పరిస్థితులే ఉదాహరణని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ అన్నారు. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే వారిని తక్షణమే ఉరి తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.
కోయంబత్తూర్‌లో పాఠశాల విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనను గుర్తుచేశారు డీఎంకే ఎంపీ టీఆర్ బాలు. నిందితులకు తక్షణమే శిక్ష పడాలని డిమాండ్ చేశారు. బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ పినాకి మిశ్రా.. నిర్భయ హత్యాచార దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంలో ఎందుకు ఆలస్యమవుతోందని కేంద్రాన్ని ప్రశ్నించారు.
దిశ కుటుంబ సభ్యులను పోలీసులు అవమానించారు....
దిశ హత్యాచార ఘటననను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.దిశ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు అవమానించారని తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ విషాదం జరిగి ఉండేది కాదన్నారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలన్నారు. దిశ లాంటి ఘటనలు జరగకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఎంపీ బండి సంజయ్ కోరారు. దిశ హత్య ఘటన అత్యంత దారుణమని... అలాంటి వాళ్లకు ఉరి శిక్ష వేయాలని తెరాస ఎంపీ మాలోత్ కవిత అన్నారు. పార్టీలకు అతీతంగా మహిళల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
కఠినంగా శిక్షించాలి...
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలు, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి, కఠినంగా శిక్షించాల్సి ఉందని రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. దిశపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను బహిరంగంగా ప్రజల మధ్య శిక్షించాలని ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే శిక్షించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని తెరాస ఎంపీ బండ ప్రకాశ్ కోరారు.
దిశ హత్యాచార ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . ఈ ఉదంతం దేశానికి సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించేందుకు చట్టంలోని నిబంధనల మార్పుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
చట్టాలు చేస్తే సరిపోదు...
దిశ హత్యోదంతంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో కేవలం చట్టాలు చేస్తే సరిపోదన్నారు. ఈ విషయంలోనూ అంతా కలిసి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు కొత్త బిల్లు అవసరం లేదు. రాజకీయ సంకల్పం, పరిపాలనా నైపుణ్యం కావాలి. ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురావలన్నారు.
పార్లమెంటు ప్రారంభానికి ముందు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. దిశకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి:ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి నుంచి కనీస ఛార్జీ - రూ.10