‘‘ఆలుమగలు పోట్లాడుకునే సమయంలో తమ కదలికలను కన్నబిడ్డలు సునిశితంగా గమనిస్తున్నారని మరచిపోతున్నారు. కుటుంబంలో మనస్పర్థలు సాధారణం. అంతమాత్రానికే ప్రభావం చూపుతుందా! బుద్ధిగా పాఠశాలకు వెళ్లొచ్చే పిల్లలు ఇవన్నీ పట్టించుకుంటారా! అనే అభిప్రాయాన్ని వారి మనసు నుంచి తొలగించాలి’’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు. దంపతుల మధ్య మనస్పర్థలకు విడాకులే అంతిమ పరిష్కారంగా భావిస్తున్నారు. అక్కడ ఎవరుగెలిచినా ఇద్దరిమధ్య చిన్నారులు నలిగిపోతున్నారు.
సంసార జీవితంలో సర్దుకుపోలేక విడిపోయేందుకు మొగ్గు చూపుతున్న ఆలుమగల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఈ తరహా కేసులు ఏటా 20శాతం అధికమవుతున్నాయి. హైదరాబాద్‌లో చిన్నపాటి విషయాలకూ ఠాణాకు చేరుతున్న దంపతులూ పెరుగుతున్నారు. తమ మాట చెల్లుబాటు కావాలనే ఆలోచన.. ఆర్థిక స్వేచ్ఛతో తాము ఒంటరిగా జీవించగలమనే ధైర్యంతో విడాకులు పొందేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. వారి దాంపత్యానికి గుర్తుగా భూమ్మీదకు వచ్చిన కన్నబిడ్డలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారనే సున్నితమైన అంశాన్ని మరచిపోతున్నారు. రూ.లక్షల సంపాదనతో అన్నీ అందించగలమనే భావనలో ఉంటున్నారంటున్నారు మనస్తత్వ నిపుణులు.
తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి పెంపకంలోనే ఉండే పిల్లలు అభద్రతా భావంతో పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. ప్రేమ, ఆప్యాయతలకు దూరమైన వారు ఆకర్షణలు, ప్రలోభాలకు తేలికగా గురవుతారంటున్నారు.
కాస్త సమయం.. మరింత మనోధైర్యం
- కాపురంలో గొడవలు సహజం. పిల్లల ముందు కోపతాపాలు ప్రదర్శించవద్దు.
- స్నేహంగా మెలుగుతూనే మేమున్నామనే భరోసా ఇవ్వాలి.
- ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలను పిల్లలు లేనపుడు చర్చించుకోండి.
- విడాకులు తీసుకున్నా పిల్లల ఆలనాపాలన ఇద్దరూ చూడడం వారికి ధైర్యాన్నిస్తుంది.
- వయసుతోపాటు పిల్లలతో మెలిగే తీరు మార్చుకోవాలి.
- నాణ్యమైన సమయం కేటాయిస్తూ మనసు పంచుకునే అవకాశం అందించాలి.
- పెరిగే పిల్లలపై తమ ప్రవర్తన ప్రభావం చూపుతుందని మరవద్దు.
- స్వేచ్ఛనిస్తూనే వారి కదలికలను గమనిస్తూ ఉండాలి
సరైన ఇంటి వాతావరణమే బాల్యానికి బలం
పిల్లల్ని సన్మార్గంలో నడిపించినా, దారి తప్పేందుకు కారణమైనా ఇంటి వాతావరణమేనని సైబరాబాద్ షీటీమ్ డీసీపీ చల్లా అనసూయ పేర్కొన్నారు. గొడవలు పడే తల్లిదండ్రుల మధ్య పెరిగే పసితనం ఒత్తిడికి గురవుతుంది. జీవితంలో ఆటుపోట్లను తట్టుకోగలిగే మనోధైర్యాన్ని అలవరచుకోలేరు. త్వరగా ఆకర్షణకు గురై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరిట మోసపోతున్న అమ్మాయిల్లో అధికశాతం వీరే. మానవ అక్రమ రవాణాల్లో గుర్తించిన అమ్మాయిల్లో నలుగురు ఇలాంటి వాతావరణంలోనే పెరిగారు. కన్నవారి అప్యాయత మధ్య పెరిగే బాల్యం ఆత్మవిశ్వాసంతో ఎదుగుతుందనేది గమనించాలని సూచించారు.
ఎదుగుదలకు అవరోధం
భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు సహజం. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే చాలా వరకు సమసిపోతాయి. తామే నెగ్గాలనే పంతంతో ఉన్నపుడే గొడవలు పెరుగుతాయని ఫ్యామిలీ కౌన్సెలర్ డాక్టర్ హరికుమార్ వివరించారు. తల్లి/తండ్రి విడిపోవడం అనేది ఆ తరువాత ఏ ఒక్కరి వద్దనో పెరిగే పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. చాలా మంది అభద్రత, ఆత్మన్యూనత భావంతో పెరుగుతారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తాము అనుకున్నది సాధించుకునేందుకు కొట్లాటకు దిగుతుంటారు. అమ్మానాన్నలను గమనిస్తూ పెరిగిన పిల్లలు తరువాత తమ వైవాహిక జీవితంలోనూ వారినే అనుకరిస్తారు. ప్రస్తుతం.. వివాహం విచ్ఛిన్నమవుతున్న దంపతుల్లో వారు పెరిగిన వాతావరణమే అందుకు ప్రధాన కారణం. మానసిక విశ్లేషకుల వద్ద కౌన్సెలింగ్ సమయంలో తమ కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇలానే ఉండేవారంటూ పంచుకుంటారు. తామూ అదే రీతిలో ప్రవర్తించకపోతే జీవిత భాగస్వామి వద్ద తక్కువ అవుతాననే బలమైన అభిప్రాయమే వారి ప్రవర్తనకు అసలు కారణమని న్యాయవాది సునీతాదేవి వివరించారు.
ఇవీ చూడండి: ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల