తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చే విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ప్రశంసిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి నిధుల మంజూరు చేయడంలేదన్నారు. పదేళ్ల క్రితం పూర్తి చేసిన గుజరాత్‌కు, కొద్దిపాటి పనులు కూడా పూర్తి కాని ఉత్తరప్రదేశ్‌కు నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణకు ప్రధానమంత్రి ఆశీర్వాదం కావాలని సీఎం కేసీఆర్ కోరితే ఇచ్చే ఆశీర్వాదం ఇదేనా.. అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ నిర్వహణ కోసం ఏడాదికయ్యే రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినప్పటికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఎంత వివక్ష చూపుతోందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
రాష్ట్ర భాజపా నేతలు కేంద్ర నిధులపై పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటి వరకు 23,287 ఆవాసాలకు తాగునీరు ఇస్తున్నామన్న మంత్రి... ఇంకా మిగిలిన 188 ఆవాసాలకు కూడా నెలాఖర్లోగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పథకం కోసం ఇప్పటి వరకు 38 వేల కోట్ల రూపాయల వ్యయం అయిందని తెలిపారు. పరిపాలన అనుమతులు ఇచ్చిన 46 వేల కోట్లలో ఎనిమిది వేల కోట్లు ఆదా అయ్యే అవకాశాలున్నాయని ఎర్రబెల్లి వివరించారు.
ఇదీ చదవండి: రవాణారంగంపై కరోనా ప్రభావం... తగ్గిన వాహన క్రయవిక్రయాలు