రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలంటూ రాష్ట్ర భాజపా దిల్లీలో ధర్నా చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రాల మంత్రులు, ఎంపిక చేసిన సర్పంచులతో కేంద్ర గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల తీరు, కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను మంత్రి దయాకర్ రావు వివరించారు. సీఎం కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రశంసించినట్లు ఎర్రబెల్లి పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా నేతలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రాలను ఆర్థికంగా ఎంతగానో ఇబ్బంది పెడుతున్నా... తాము విమర్శలు చేయట్లేదన్నారు. తాము రాజకీయం చేస్తే భాజపా అడ్రస్ లేకుండాపోతుందని దయాకర్ రావు అన్నారు. అలా కాకుండా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
ఇయ్యాల చెరువులు నిండినయి. ఉపాధి హామీ పథకం అనుకున్నంతగా పని దొరుకుతలేదు. రైతుల అనుసంధానం చేస్తే చాలా బాగుంటది. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయమని మోదీ గారిని కోరాం. వీటి కోసం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు దిల్లీలో ధర్నా చేయాలి. మీ బీజేపీ రాష్ట్రాల్లో బియ్యం కొంటున్నరా ? మక్కలు కొంటున్నరా ? శనగలు కొంటున్నరా ? రాజకీయాలు చేయకండి. రాజకీయాలు మేం చేస్తే మీ అడ్రస్ లేకుండా పోతారు.
- ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి