bills for Panchayaths: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. కొన్నిచోట్ల సర్పంచులు సొంతంగా ఖర్చుపెట్టి పనులు చేసినప్పటికీ, అయిదారు నెలలుగా ఆ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగుల వేతనాలు, విద్యుత్తు ఛార్జీలు మినహా సగటున ఒక్కో గ్రామంలో 3-6 నెలల వరకు బిల్లులన్నీ ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకూ మూడు నెలలుగా జీతాల్లేవు. అసలే డబ్బులు రాక ఇబ్బందుల్లో ఉంటే మరో పక్క ఈ నెల నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కింద చేపట్టాల్సిన పనులను చూసి సర్పంచులు, పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గ్రామాల్లో జనాభా, కేటగిరీ వారీగా సగటున రూ.లక్షన్నర నుంచి రూ.6 లక్షల వరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు కలిపితే రూ.లక్షల్లో నిలిచిపోయాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తోంది. ఇవి పంచాయతీ ఖాతాల్లో కనిపిస్తున్నప్పటికీ, వీటిని నేరుగా వినియోగించకుండా ఆర్థికశాఖ ఆంక్షలు అడ్డుగా నిలుస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులు జారీ చేసిన చెక్కులు సబ్, జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో పాస్ అవుతున్నా, చివర్లో ప్రభుత్వ అనుమతి పేరిట ఆర్థికశాఖలో నిలిచిపోతున్నాయి. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియడంతో మళ్లీ బిల్లుల వ్యవహారం మొదటికొచ్చింది. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు, మురుగు కాలువలకు సంబంధించిన బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్నాయి. వీధి దీపాల మరమ్మతుల బిల్లులు పంచాయతీరాజ్ శాఖ మంజూరు చేయడం లేదు. ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పాలన్న నిర్ణయానికి సర్పంచులు, పాలకవర్గాలు వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. ప్రస్తుతం వీరి నెల జీతం రూ.8,500. వేతన సవరణ అమల్లోకి వచ్చినప్పటికీ.. కార్మికులకు 30 శాతం పెంపు జరగలేదు. చాలీచాలని జీతాలు.. అవి కూడా రెండు, మూడు నెలలకోసారి వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.- ఓ సర్పంచ్ ఆవేదన
ఇవీ ఉదాహరణలు..
* ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ఇనగాలి గ్రామంలో సర్పంచి యరమల వెంకట్‌రెడ్డి.. ఎస్సీ కాలనీలో రూ.4.5 లక్షలతో డ్రెయిన్, బీసీ కాలనీలో రూ.3.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. ఈ బిల్లులు ఫిబ్రవరి నుంచి నేటికీ మంజూరు కాలేదు.
* కరీంనగర్ జిల్లా శంకరంపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామ సర్పంచి రూ.7లక్షలు ఖర్చుపెట్టి శ్మశాన వాటిక నిర్మించారు. పైసలు రాక ఏడాదిన్నరైంది. కరీంపేటలో రూ.5 లక్షలు ఖర్చుచేసి నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం బిల్లులు విడుదల కాలేదు.
* కామారెడ్డిలోని 8 వేల జనాభా కలిగిన ఓ మేజర్ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు, ఇతర పనులకు ఖర్చుచేసిన రూ.6 లక్షలు ఆరు నెలలగా మంజూరు కాలేదు.
* మెదక్‌లోని 5 వేల జనాభా కలిగిన గ్రామ పంచాయతీలో డీజిల్ ఖర్చులు, తాగునీటి పైపులు, విద్యుత్తు దీపాలు, బ్లీచింగ్ పౌడర్ తదితర పనులకు వెచ్చించిన నిధులు రూ.లక్షన్నర పెండింగ్‌లో ఉన్నాయి. వీటి మంజూరుకు నవంబరులో చెక్కులు జారీ చేసినా, మార్చి 31 నాటికి ఆమోదం పొందకపోవడంతో అవి తిరస్కారానికి గురయ్యాయి. దీంతో కొత్తగా చెక్కులు జారీ చేసినా ఇంకా డబ్బులు రాలేదు.
సర్పంచినయ్యా.. జర భిక్షం వెయ్యండయా..!
చిత్రంలో నిక్కర్, బనియన్ వేసుకుని కనిపిస్తున్న వ్యక్తి నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి మిర్యాల వెంకన్న.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాక ఆవేదనతో సోమవారం పాలకవర్గం, కార్మిక సిబ్బందితో కలిసి భిక్షాటన చేశారు. పంచాయతీ కార్మికులతో అనేక పనులు చేయించుకుంటున్నామని...మూడు నెలలుగా వేతనాలు అందక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. భిక్షాటన ద్వారా రూ.10 వేలు సమకూరగా ఆ నగదును సిబ్బందికి అప్పజెప్పినట్లు సర్పంచి వివరించారు. ఈ పంచాయతీలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ.40 లక్షల బిల్లులు ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి.
ఇవీ చూడండి: రూ.3 వేల కోట్ల బకాయిల వసూలుకు ఓటీఎస్ పథకం తెచ్చిన ప్రభుత్వం
దివ్యాంగ చిన్నారికి విమానంలో నో ఎంట్రీ.. కేంద్రమంత్రి ఫైర్.. దిగొచ్చిన ఇండిగో!