Kaushik Reddy Latest Comments: ఈ ఏడాదిలో జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికల టికెట్ల పంపిణీపై బీఆర్ఎస్ దృష్టిపెట్టినట్టే కనిపిస్తోంది. ఈ మేరకు హుజూరాబాద్ టికెట్ తనకు ఇచ్చినట్టు శాసనమండలి విప్ కౌశిక్‌రెడ్డి తెలిపారు. శాసనమండలి విప్‌గా నియమితులైన కౌశిక్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు హాజరై.. కౌశిక్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కౌశిక్‌రెడ్డి వచ్చే శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని దీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థిగా తన పేరును ఇప్పటికే ప్రకటించారని వివరించారు. ఇప్పటి నుంచే ఆ దిశగా పని చేయాలని సూచించారని తెలిపారు. కేటీఆర్ ఆదేశాల మేరకు హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. విప్‌గా తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని.. ఈటల రాజేందర్‌ను ఇక ఇంటికి పంపిస్తానని వ్యాఖ్యానించారు.
'మొన్ననే బీఆర్ఎస్ పార్టీ టికెట్‌ను మంత్రి కేటీఆర్.. మొదటి టికెట్‌గా ఈ రాష్ట్రంలో హుజూరాబాద్‌లో నన్ను నమ్మి ఇచ్చినందుకు ఖచ్చింతంగా రాబోయే కాలంలో గులాబీ జెండా హుజూరాబాద్‌లో ఎగురవేస్తామని తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు నా ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేస్తున్నాను'. -పాడి కౌశిక్‌రెడ్డి, శాసన మండలి విప్
సీఎం ఆశీర్వాదం తీసుకున్న కౌశిక్‌రెడ్డి..: శాసనమండలి విప్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కౌశిక్‌రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.
గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఇటీవల మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన విషయం విధితమే. ఈ పర్యటనలో కేటీఆర్.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో జరిగిన పొరపాటు మళ్లీ జరగొద్దని, హుజూరాబాద్ గడ్డ మీద రాబోయే ఏడెనిమిది నెలల్లో గులాబీ జెండా ఎగుర వేద్దామని కార్యకర్తలకు సూచించారు. మంత్రి కేటీఆర్ పర్యటన నియోజకవర్గ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది.
ఇవీ చదవండి: