లంచం తీసుకుంటూ అనిశాకు దొరికిన కొంతమంది అధికారులు... సచివాలయంలో పైరవీలు చేసుకొని బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. అవినీతి అధికారులపై సత్వరమే చర్యలు తీసుకునేలా చూడాలని గవర్నర్కు లేఖ రాశారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారుల నివేదికను అనిశా అధికారులు సచివాలయానికి పంపుతారని... అక్కడ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు విచారణకు అనుమతిస్తారని పద్మనాభరెడ్డి తెలిపారు.
చిరుద్యోగులపై చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు.... పలుకుబడి కలిగిన అధికారులపై విచారణకు అనుమతించకుండా తాత్సారం చేస్తున్నారని పద్మనాభ రెడ్డి ఆరోపించారు. అనిశా నివేదికను సచివాలయంలో వక్రీకరించి దర్యాప్తు పారదర్శకంగా జరగకుండా కొంత మంది అధికారులు అడ్డుపడుతున్నారు.
11ఏళ్ల క్రితం అనిశాకు చిక్కిన కొంతమంది అధికారులపై ఇప్పటికీ... విచారణ లేకపోవడమే దీనికి నిదర్శనమని తెలిపారు. లంచం తీసుకుంటూ దొరికిన, ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారులపై వీలైనంత తొందరగా చర్యలు తీసుకునేలా చూడాలని గవర్నర్ తమిళిసైని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి కోరారు.