సహకార ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో మెుత్తం 909 సహకార సంఘాలు ఉండగా... 906 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని ఒక్కో పీఏసీఎస్ మినహా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
పీఏసీఎస్‌ల ఎన్నికల కోసం వచ్చే నెల మూడో తేదీన ఎన్నికల అధికారులు స్థానికంగా నోటీసు ఇస్తారు.ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. పరిశీలన తొమ్మిదిన జరగనుంది. ఉపసంహరణకు పదో తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 15వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
ఫలితాలు ప్రకటించిన మూడు రోజుల్లోగా ఆఫీసు బేరర్ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 13 చొప్పున డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పీఏసీఎస్ ఛైర్మన్లను పరోక్ష పద్ధతిన ఎన్నుకుంటారు.