గూడ్సు రైళ్లు 50-60 వ్యాగన్లతో పొడవుగా ఉంటాయి. ప్రయాణికుల రైళ్లకు 24 వరకు బోగీలు ఉంటాయి. వీటితో పోలిస్తే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ చాలా చిన్నది. 5-6 లారీలు.. డ్రైవర్ల విశ్రాంతికి ఓ కోచ్, ఇంజిన్.. అంతే! ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఒడిశా నుంచి బయల్దేరాక గమ్యస్థానమైన సనత్‌నగర్ స్టేషన్ చేరేవరకు మార్గంమధ్యలో ఎలాంటి అవరోధాలు ఉండవు. ప్రాణాల్ని కాపాడే వాయువును తెచ్చే ఈ రైళ్లకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఈ రైలు ప్రయాణ సమయంలో మిగతా రైళ్లన్నింటిని నిలిపివేస్తారు.
గరిష్ఠ వేగం 60 కిలోమీటర్లే
ఈ రైళ్లు ప్రయాణించే మార్గంలో ట్రాక్ గంటకు 110-130 కి.మీ. వేగాన్ని తట్టుకుంది. సిగ్నలింగ్, ఇతర ఆటంకాలు ఏమీ లేవు. కానీ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గరిష్ఠంగా 60 కి.మీ.కి మించి వేగంగా వెళ్లడం లేదు. భద్రత కారణాలతోనే వేగాన్ని పరిమితం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ‘అత్యధిక వేగంతో వెళ్తే లారీ ట్యాంకర్లు కుదుపులకు లోనయ్యే, కిందపడే అవకాశం ఉంది’ అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ‘రైలుపై లారీ ట్యాంకర్లు కదలకుండా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు టైర్లలో గాలిని కూడా తీసేస్తున్నాం. గమ్యస్థానం చేరాక మళ్లీ టైర్లలో గాలి నింపాలి. తిరుగు ప్రయాణంలో రైలుపై ట్యాంకర్లను ఎక్కించాక గాలి తీసి.. సనత్‌నగర్ చేరాక ట్యాంకర్లను దింపేటప్పుడు మళ్లీ టైర్లలో గాలి నింపాలి. రైలు నుంచి లారీల్ని దింపడానికే 2 గంటలు పడుతోంది’ అని వివరించారు.
పాల రైలు వేగం 110 కి.మీ.
ద.మ. రైల్వే పరిధిలోని తిరుపతి నుంచి దిల్లీకి పాలు వెళ్తాయి. దూధ్ దురంతో పేరుతో ప్రత్యేక రైలు నడుపుతున్నారు. 2,162 కి.మీ. దూరం. 60 కి.మీ.ల సగటు వేగంతో 36 గంటల్లోనే చేరుతుంది. ఈ రైలుకు పాల ట్యాంకర్లు శాశ్వత ప్రాతిపదికన బిగించి ఉన్నాయి. దాంతో గంటకు 110 కి.మీ. వేగంతో వెళ్లినా ఏం కాదు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లో అలా కాదు.. లారీ ట్యాంకర్లను రైలుపైకి ఎక్కిస్తున్నారు. అందుకే లారీలు కదలకుండా తక్కువ వేగంతో నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రస్తుతం 1,334 కి.మీ. దూరానికి 31 గంటల సమయం పడుతోంది. శాశ్వత ప్రాతిపదికన ట్యాంకర్లు బిగిస్తే 20-22 గంటల్లోనే.. అంటే 9-11 గంటల ముందే ప్రాణవాయువు చేరే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి