శునకాలు విశ్వాసానికి మారు పేరు. అవి ఇంట్లో ఉన్నాయంటే యజమానికి కొండంత భరోసా. వీటిని కొందరు కాపలా కోసం పెంచుకుంటే.. మరికొందరు సరదా కోసం పెంచుకుంటారు. ఇంట్లో సభ్యుడిగా చూసుకుంటారు. వాటికి ఏమీ కాకుండా జాగ్రత్తపడతారు. అంత ప్రేమగా చూసుకుంటున్న శునకం చనిపోతే... ఆ యజమాని పడే వేదన వర్ణనాతీతం. సరిగ్గా ఇలాంటి ఘటనే విజయవాడలో జరిగింది.
ఆరోగ్యం దెబ్బతినడంతో...
ఏపీలోని విజయవాడకు చెందిన యలమంచిలి శ్రీమన్నారాయణ.. వృత్తి రీత్యా బ్యాంక్ ఉద్యోగి. ఆయన కుటుంబ సభ్యులు 13 ఏళ్ల క్రితం ఓ కుక్కపిల్లను తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో సమానంగా స్థానం కల్పించి, ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా శునకానికి ఆరోగ్యం దెబ్బతింది. పశువైద్యులను సంప్రదించి చికిత్స అందించినప్పటికీ... ఫలితం లేకుండా పోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ శునకం ఇవాళ మరణించింది.
సంప్రదాయంగా అంత్యక్రియలు...
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యజమాని శ్రీమన్నారాయణ కుటుంబసభ్యులు.. తమ సొంత కుటుంబసభ్యులను కోల్పోయినంతగా బాధపడ్డారు. శునకంపై పెంచుకున్న మమకారంతో సంప్రదాయం ప్రకారం వారి స్వగ్రామమైన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు. మనుషులకు నిర్వహించినట్లే ఆఖరి క్రతువు పూర్తి చేశాడు. అనంతరం పురోహితుడితో పిండ ప్రదానం చేయించాడు.
ఇవీచదవండి: Hyderabad Rain : హైదరాబాద్లో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం