OU Lands: ఒక్క రూపాయికి ఏమొస్తది? చాయ్ రాదు, నీళ్లు రావు, చిన్న పిల్లాడికి చాక్లెట్ కూడా రాదు. కానీ రాష్ట్రంలో మారుమూల పల్లెల్లోనూ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. హైదరాబాద్ మహానగరంలో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల లీజుకు వస్తున్న సొమ్ము ఆ ఒక్క రూపాయే. దశాబ్దాల కింద జరిగిన ఒప్పందం.. ఆర్థిక కష్టాల్లో ఉన్న వర్సిటీకి ఆదాయం రాకుండా చేస్తోంది.
కేవలం రూపాయి చెల్లించేలా..
అది తార్నాక ప్రధాన రహదారిలో రాష్ట్ర రాజ్యాభిలేఖ పరిశోధన సంస్థ. 1957లో 5 ఎకరాలను కేటాయించి ఓయూ భూముల్లోనే ఏర్పాటు చేశారు. అప్పటి లెక్కల మేరకు విశ్వవిద్యాలయానికి కేవలం రూపాయి చెల్లించేలా 99 ఏళ్లకు లీజు ఒప్పందం కుదిరింది. ఆ పక్కనే ఉన్న జాతీయ పోషకాహార సంస్థకు 1951లో 32.5 ఎకరాల ఓయూ భూములను కేటాయించారు. వీటి లీజు ధర కూడా కేవలం రూపాయి మాత్రమే. అంటే దాదాపు 70 ఏళ్లుగా లీజు ద్వారా ఓయూకు వచ్చిన ఆదాయం 2వేల 307 రూపాయలు.! ఇవే కాదు.. ఇఫ్లూ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, సంస్కృత అకాడమీ... ఇలా దాదాపు 27 సంస్థలకు గత ప్రభుత్వాలు ఓయూ భూములను కట్టబెట్టాయి. అప్పట్లో ఉన్న ప్రభుత్వ లీజు ఒప్పందాల ప్రకారం అగ్గువకే అప్పజెప్పారు. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అవే ధరలు అమలు చేయడం వర్సిటీ ఆదాయానికి గండి కొడుతోంది.
కబ్జా కోరల్లో భూములు
1917లో 1627 ఎకరాల స్థలంలో ఏర్పడిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికే.. 200ఎకరాలకు పైగా కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం వర్సిటీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు సరిగా రాకపోవడం.. ఏటా బడ్జెట్‌లో కేటాయించే నిధులు జీతాలకు కూడా చాలక సతమతవుతున్న పరిస్థితి ఉంది. కానీ వర్సిటీ అధికారులు ఆదాయం పెంచుకునేందుకు కోర్సుల ఫీజుల పెంచి విద్యార్థులపై భారం మోపుతున్నారే తప్ప.. భూముల లీజు రేట్లను పునః సమీక్షించడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చర్యలు తీసుకోవాలి..
లీజు రేట్లను పునః సమీక్షించడంతో పాటు ఆక్రమణలు అరికట్టేలా యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి...
లీజులతో వర్సిటీకి నష్టం
ఏళ్ల తరబడిగా తక్కువ ధరకే భూముల లీజు కొనసాగిస్తుండంతో యూనివర్సిటీకి తీవ్రంగా నష్టం కలుగుతోంది. వీటిపై పునఃసమీక్షించాల్సి ఉంది. మరోవైపు వర్సిటీకి ఆదాయార్జన కోసం విద్యార్థులపై భారం మోపుతున్నారు. అన్ని సంస్థలకు ఇచ్చిన భూములపై పరిశీలన చేసి ప్రస్తుత మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరలు నిర్ణయించాలి. -కాంపల్లి శ్రీనివాస్, ఏఐఎస్‌ఎఫ్ ఓయూ నాయకులు
ఆక్రమణలను నియంత్రించాలి
ఓయూ భూములు ఇప్పటికే అన్యాక్రాంతమవుతున్నాయి. భూములను కాపాడే ప్రయత్నాలు చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. వర్సిటీ భూములలో ఆక్రమణలు తొలగించి పరిరంక్షిచాలి. లీజుల వ్యవహారంపై తిరిగి నిర్ణయించేలా ప్రభుత్వంతో మాట్లాడాలి. -జీవన్, ఏబీవీపీ నాయకులు
ఇదీ చదవండి: