హైదరాబాద్ పాతబస్తీలోని ఉస్మానియా ఆసుపత్రిని భాజపా బృందం సందర్శించింది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో నేతలు ఆసుపత్రిలోని తాజా పరిస్థితులను పరిశీలించారు. అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్లో ఎంతో పేరు గాంచిన ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే దవాఖాన వరద నీటితో నిండిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై నోరు విప్పడం లేదంటూ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ.. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ అసుత్రులపై లేదని సంజయ్ విమర్శించారు. కార్పొరేట్ అసుత్రుల్లో దోపిడీని అరికట్టడంలో సీఎం విఫలమయ్యారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమని అడిగితే కనీసం స్పందించలేదని అన్నారు.
ఉస్మానియా ఆసుపత్రి కూలే పరిస్థితిలో ఉందని.. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు. ఉస్మానియా అభివృద్ధిపై తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు.. ఎందుకంటే?