ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తామున్నామంటూ చికిత్సలు అందిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయంలో వచ్చే శస్త్ర చికిత్సలను వైద్య బృందం కొనసాగిస్తోంది. ఇలా నిత్యం 10-12 మంది రోగులకు అత్యవసర శస్త్ర చికిత్సలు చేసి ఉపశమనం కల్పిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ భయంతో అత్యవసర చికిత్సలను తిరస్కరిస్తున్నారు. చాలావరకు కొర్రీలు పెడుతున్నారు. ఫీజుల భారం తప్పడం లేదు. కొవిడ్ లక్షణాలు ఉన్న ఓ రోగిని చేర్చుకొని ఒకరోజు ఆసుపత్రిలో ఉన్నందుకు ఓ ఆసుపత్రి రూ.80 వేల బిల్లు ఇవ్వడంతో రోగి బంధువులు లబోదిబోమన్నారు. ఇక జ్వరం, శ్వాసకోశ సమస్యలు లాంటివి ఉంటే చేర్చుకోవడానికి విముఖత చూపుతున్నారు.
కరోనా లక్షణాలు లేని కేసులను మాత్రమే చేర్చుకుంటున్నారు. దీంతో అత్యవసర కేసులను ఉస్మానియా వైద్యశాల అక్కున చేర్చుకుంటోంది. ఎలాంటి స్థితిలో వచ్చినా... రోగులకు భరోసా అందిస్తోంది. గతంలో ఈ ఆసుపత్రికి నిత్యం 2 వేల మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు వచ్చే వారు. కోవిడ్ నేపథ్యంలో మొదట్లో ఈ సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. రోజుకు 50 మంది రావడమే గగనమైంది. తర్వాత క్రమేపీ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం నిత్యం 500-600 మంది వరకు రోగులు వస్తున్నారు. కరోనాతో గాంధీలో ఇతర వైద్య సేవలను పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్నిరకాల రోగాలకు ఉస్మానియా పెద్ద దిక్కుగా నిలుస్తోంది.
అత్యవసర చికిత్స ముందు...
అత్యవసర సమయంలో వచ్చే వారికి తొలుత శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు. తర్వాత లక్షణాలను బట్టి కరోనా అనుమానం ఉంటే శాంపిళ్లు సేకరించి గాంధీకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఐసీఎంఆర్ నిబంధనలను పాటిస్తున్నారు. గతంలో శస్త్ర చికిత్సలు చేసేటప్పుడు పచ్చగౌను, చేతికి గ్లౌజు, ముఖానికి మాస్క్ ధరిస్తే సరిపోయేది. కరోనా నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది అదనపు భద్రతా చర్యలు పాటిస్తున్నారు.
ఆపరేషన్ గదిలోకి పీపీఈ కిట్లుతో అడుగు పెడుతున్నారు. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకొని అత్యవసర శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. సాధారణ ఓపీకి వచ్చే రోగులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారు. అక్కడ శాంపిళ్లు సేకరించి వాటిని గాంధీకి పంపుతున్నారు. కోవిడ్ ఉన్నట్లు తేలితే అలాంటి వారిని గాంధీకి తరలిస్తున్నారు. అయితే ఎంపిక చేసిన శస్త్ర చికిత్సలు(ఎలెక్టివ్) అప్పుడే చేపట్టే పరిస్థితి మాత్రం కన్పించడం లేదు. కరోనా ప్రభావం పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత వీటిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు పేదలకు, ఇతర వర్గాలకు అత్యవసర వైద్యం అందించడంలో ఉస్మానియా ముందు వరుసలో ఉంది. ఆసుపత్రికి వచ్చేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: శంషాబాద్ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట