తపాలా ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పంచాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు .పోలింగ్‌శాతాన్ని పెంచడం, ఓటర్ల రక్షణ అంశాల్లో భాగంగా ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై ఎన్నికల అథారిటీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ మంగళవారం ఆయన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వయసు 55 ఏళ్లకు మించని ఆరోగ్యవంతులైన అధికారులనే ఎన్నికల విధులకు తీసుకోవాలని... వేర్వేరు బాధ్యతలకు నోడల్ అధికారులను నియమిస్తూ లోక్‌ష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరులో బల్దియా ఎన్నికలు జరగనున్నాయన్న సమాచారంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
60వేల మంది అధికారులు..
కొవిడ్ వ్యాప్తి నుంచి ఓటర్లకుగానీ, ఎన్నికల అధికారులు, సిబ్బందిగాని ఇబ్బందులు తలెత్తకూడదన్న లక్ష్యంతో యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికలకు గ్రేటర్ పరిధిలో 9వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. గ్రేటర్ ఎన్నికలకు 12వేల కేంద్రాలు అవసరమని అధికారులు నిర్ణయించారు. పోస్టల్ బ్యాలెట్‌తో అయితే ప్రతి 800 మందికి ఓ పోలింగ్ కేంద్రం(పీఎస్), ఈవీఎంలు వినియోగిస్తే గరిష్ఠంగా 1,200 మందికి ఓ పీఎస్ అవసరమన్నారు. ఎన్నికలు 30 సర్కిళ్ల పరిధిలోని 150 డివిజన్లకు జరగనున్నాయి. సర్కిల్ ఉపకమిషనర్ ఎన్నికల అధికారి (ఈఆర్‌ఓ)గా వ్యవహరిస్తారు.
కలిపి 60వేల మంది అవసరం అవుతారని అంచనా
ఆయన పరిధిలో 4 నుంచి 6 డివిజన్లుంటాయి. వాటి పరిధిలో నివాసం లేని, ఆ సర్కిల్‌లో ఇప్పటి వరకు విధులు నిర్వహించని అధికారులను ఎన్నికల నిర్వహణకు తీసుకుంటారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగినందున 20శాతం రిజర్వు స్టాఫ్‌తో కలిపి 60వేల మంది అవసరం అవుతారని అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) వద్ద వీవీప్యాట్‌తో కలిసి ఉండే ఆధునిక ఈవీఎంలు లేవు. పాత తరానికి చెందినవి ఉన్నాయి. వాటిని ఉపయోగించాలా లేక కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి తెప్పించుకోవాలా, బ్యాలెట్ పెట్టెలను ఉపయోగించాలా అనే అంశంపై రాజకీయపార్టీలు అభిప్రాయం వెల్లడించాక కసరత్తు మొదలుకానుంది.
అధికారులకు బాధ్యతలు
ఎన్నికల్లో బ్యాలెట్ పెట్టెల వినియోగానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదనపు కమిషనర్ డాక్టర్ ఎన్.యాదగిరిరావుకు బ్యాలెట్ పెట్టెలను సమకూర్చే బాధ్యతను అప్పగించారు. ఎన్నికల నియమావళి అమలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నిర్వహణ ఐపీఎస్ అధికారి, అదనపు కమిషనర్ విశ్వజిత్ కంపాటికి ఇచ్చారు. ఓటరు నమోదు, సవరణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఓటరు చైతన్య కార్యక్రమాలు, శిక్షణ అధికారుల నియామకం, ఐటీ వినియోగం, వెబ్‌కాస్టింగ్ బాధ్యతలకు అదనపు కమిషనర్లు సంతోష్, ప్రియాంక, రాహుల్‌రాజ్, జయరాజ్‌కెనడి, వి.కృష్ణ, శంకరయ్య, సీసీపీ దేవేందర్‌రెడ్డి, సీఈ జియాఉద్దీన్‌సహా మొత్తం 21 మంది నోడల్ అధికారులుగా నియమితులయ్యారు.
ఇదీ చదవండి: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో లోయలో పడిన వ్యాను.. 10మందికి గాయాలు