రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 3,600 మంది చిన్నారులను పోలీసులు కాపాడారు. ఆపరేషన్ స్మైల్ ఆరో విడత ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు అధికారుల బృందం తనిఖీలు చేసింది. పోలీస్ శాఖ నేతృత్వంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో తప్పిపోయిన పిల్లలు, బాలకార్మికులు, వెట్టి చాకిరిలో, ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న పిల్లలు, యాచకులను గుర్తించి రక్షించారు.
పొరుగు రాష్ట్రాల చిన్నారులే ఎక్కువ...
3,600 మంది చిన్నారుల్లో 2,923 బాలురు, 677 మంది బాలికలున్నారు. 1,982 మంది చిన్నారులను తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించగా.... 1,618 చిన్నారులను పునరావాస కేంద్రాల్లో చేర్పించారు. 1,292 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు ఉండడం గమనార్హం. నేపాల్‌కు చెందిన 13 మంది, మయాన్మార్‌కు చెందిన నలుగురు చిన్నారులను పోలీసులు కాపాడారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు... ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన చిన్నారులు వందల సంఖ్యలో పోలీసులకు దొరికారు. అధికంగా ఒడిశాకు చెందిన 304 చిన్నారులను రక్షించారు.
బ్లాక్స్పాట్లపై ప్రత్యేక దృష్టి...
ఆపరేషన్ స్మైల్‌లో మొట్టమొదటిసారిగా చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖ కవళికలను గుర్తించే దర్పణ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం సత్ఫలితాలనిచ్చింది. కల్వకుర్తి, కుషాయిగుడా పోలీస్‌స్టేషన్ పరిధిలో తప్పిపోయిన ఇద్దరు పిల్లలను దర్పణ్ అప్లికేషన్ సాయంతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలకార్మికులు ఎక్కువగా ఉండే, చిన్నారుల దుర్భర స్థితిలో ఉండే ప్రాంతాలను తెలుసుకొని వాటిని బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ప్రధానంగా రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, మతపరమైన స్థలాలు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీస్టాళ్ళు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
బాలకార్మిక చెర నుంచి విముక్తి...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో ఉన్న ఓ పరిశ్రమలో ఒకేసారి 12మంది బాలకార్మికులను గుర్తించారు. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలోని పాతవస్తువులు నిల్వచేసే గోదాములో 11 మందిని రాచకొండ బృందాలు కాపాడాయి. తనిఖీల్లో దొరికిన పిల్లలందరినీ మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న గృహాల్లో చేర్పించారు. పిల్లల వివరాలు, ముఖాలను డిజిటలైజ్ చేసి... అన్ని పోలీస్స్టేషన్లకు అనుసంధానం చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చిన్నారులు తప్పిపోయినా, అపహరించుకుపోయిన కేసులు నమోదైనా... వెంటనే సరిపోల్చి తల్లిదండ్రులకు అప్పజెప్పే అవకాశం ఉంది.
పిల్లలను అక్రమంగా తరలించే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గతేడాది జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా పిల్లలను పనిలో పెట్టుకున్న 411 మందిపై కేసులు నమోదు చేశారు. అత్యధికంగా 404 మంది చిన్నారులను రక్షించి సైబరాబాద్ పోలీస్‌స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. ఆపరేషన్ స్మైల్‌లో పాల్గొన్న పోలీస్ బృందాలను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.
ఇదీ చూడండి:- బడ్జెట్‌పై భాజపా హర్షం... మోదీ-నిర్మలపై ప్రశంసల వర్షం