జులై 1 నుంచి రాష్ట్రంలో ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకే ఆన్‌లైన్ (inter online class) తరగతులు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు (inter board) కార్యదర్శి జలీల్ ప్రకటించారు. ప్రవేశాలు ముగిసిన అనంతరం మొదటి సంవత్సరం తరగతులు ఉంటాయని తెలిపారు. టీశాట్, దూరదర్శన్ ద్వారా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.
గతేడాదిలాగే ఈ సారి కూడా 70 శాతం సిలబస్ మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు జులై 5వరకు జరుగుతాయని... ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని జలీల్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా కొవిడ్ పరిస్థితుల కారణంగా ఫీజు తీసుకోకుండానే అనుమతులు పునరుద్ధరించాలనే యాజమాన్యాల అభ్యర్థనపై సమాలోచనలు జరిపిన బోర్డు... జూనియర్ కళాశాలల గుర్తింపు ప్రక్రియలో పలు మినహాయింపులు ఇస్తూ కొన్ని రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన అనుబంధ గుర్తింపు ఫీజులను ఇంటర్ బోర్డు(intermediate board) వెనక్కి తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని సుమారు 1800 ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియలో పలు మినహాయింపులను ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 మీటర్ల లోపు ఎత్తు భవనాల్లో నిర్వహిస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఆటోమేటిక్గా గుర్తింపు పునరుద్దరించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. గతేడాది ఫీజులతోనే కాలేజీల గుర్తింపును పునరుద్ధరించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. శానిటరీ, నిర్మాణ సామర్థ్య ధ్రువీకరణ పత్రాలు, 33 శాతం సిబ్బంది వివరాలను 90 రోజుల్లో సమర్పించేందుకు యాజమాన్యాలకు అవకాశం ఇచ్చింది.
ఇదీ చూడండి: Toss: అందరూ ఉత్తీర్ణులే... ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు