ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్న వేళ ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టి కొంత రాయితీ కల్పించినా సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. రైతు బజార్ల అధికారుల తీరుతో అవస్థలు పడుతున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లలో గంటల తరబడి ప్రజలు వేచిఉండి కొనుగోలు చేస్తున్నారు. అక్టోబర్ 24 నుంచి జంట నగరాల్లో 11 రైతు బజార్లలో ఈ విక్రయాలు జరుగుతున్నాయి.
"ఒక్కో కార్డుకు రోజు రెండు కిలోలు ఇవ్వమని సీఎం కేసీఆర్ ఆదేశిస్తే... రైతు బజార్ అధికారులు ఒకే కేజీ ఇస్తున్నారు. దీనివల్ల జనాలు చాలా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయకుండా, ఒకే కిలో అని బోర్డులు పెడుతున్నారు. ఇది సరైనది కాదు. రెండు కేజీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదు. ఒకే కిలో కోసమే లైన్లలో నిలబడి ఎదురుచూడాల్సి వస్తుంది."
- సీతారాములు (వినియోగదారుడు)
సరుకు తక్కువ ఉండటం వల్లే కేవలం ఒక కిలో ఇస్తున్నామని, ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువే అందిస్తున్నామని రైతు బజార్ల అధికారులు తెలిపారు. ఈ నెల చివరి నుంచి కొత్త పంట అందుబాటులోకి వస్తుందని, అప్పటి వరకు ఇలానే కొనసాగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దళారులు ఈ ఉల్లి గడ్డలను బయట విక్రయించేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ధరలు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో ఉల్లి అమ్మకాలు