హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. గాంధీలో చికిత్స కోసం తీసుకువచ్చిన 24గంటల్లోనే ఆయన మృతి చెందాడు. కుటుంబసభ్యులకు కూడా కొవిడ్ సోకడం వల్ల వారికి గాంధీలో చికిత్స అందించారు. వారి అనుమతితోనే ఆ వృద్ధుడి మృతదేహానికి జీహెచ్ఎంసీ సిబ్బందే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అయితే కుటుంబసభ్యులు కోలుకుని ఒక్కొక్కరిగా ఇంటికి చేరిన తర్వాత...వృద్ధుడి కుమారుడు మధుసూదన్ ఆచూకీ మాత్రం లేకుండా పోయింది. ఆస్పత్రి వర్గాలు ఒకసారి ఐసీయూలో ఉన్నారని.. మరోమారు మృతి చెందాడని చెబుతున్నారని మధుసూదన్ భార్య మాధవి... ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కి ఫిర్యాదు చేశారు.
స్పందించిన మంత్రి
ట్విట్టర్‌లో మాధవి చేసిన ఆరోపణలపై గాంధీ వైద్యులు స్పందించారు. గత నెల 30న ఆస్పత్రికి వచ్చిన మధుసూదన్.. ఈ నెల 1న మృతి చెందాడని... ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం శవాన్ని పోలీసులకు అప్పగించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాప్యం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని... అప్పటికే ఇంటి పెద్దైన వృద్ధుడి మృతితో దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని మరింత కుంగదీయవద్దనే ఉద్దేశంతోనే అధికారులు వ్యవహరించారని మంత్రి ఈటల పేర్కొన్నారు.
సాధారణంగా కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తికి... కుటుంబసభ్యులు దహనం చేసే పరిస్థితి లేకపోతే అధికారులే ఖననం చేయవచ్చు. ఇది ప్రభుత్వం నిబంధనల ప్రకారం కరోనా మృతుల అంత్యక్రియలకు సంబంధించి పాటించాల్సిన నియమాలు. అయితే మధుసూదన్ విషయంలో మాత్రం కుటుంబ సభ్యులకు చెప్పకపోవడం పట్ల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా మధుసూదన్ చివరి చూపునకు కూడా నోచుకోలేదంటున్న కుటుంబసభ్యుల ఆవేదన మాత్రం అందరినీ కలచివేస్తోంది.
ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక