ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. డిస్టిలరీ విభాగంలో అమోనియా నుంచి కార్బన్ డయాక్సైడ్ తయారు చేసే క్రమంలో పైప్ లీకేజ్ కారణంగా గ్యాస్ వెలువడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. విషవాయువు లీకైందన్న భయంతో వారంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాసులు మృతి చెందగా, నలుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆర్డీవో రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రవికుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇటీవలే విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ పైప్ వెల్డింగ్ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ప్రమాదం వివరాలను అధికారులే సమీక్షిస్తున్నారని కంపెనీ ఎండీ శ్రీధర్‌రెడ్డి చెప్పారు.
అమోనియా గ్యాస్ లీకైంది: కలెక్టర్
ఎస్పీవై ఆగ్రోస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీకైందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. అస్వస్థతకు గురైన ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడించారు. యుద్ధప్రాతిపదికన అన్ని భద్రతా చర్యలు చేపట్టామని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చిందని కలెక్టర్ ప్రకటించారు.
-
ఇదీ చూడండి: మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్