జనం ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సిన ప్రజావాణిని భూ సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న సమస్యలు ధరణిలో ఐచ్ఛికాలు లేక పెండింగ్ పడిపోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. వాటిపై ‘ఈనాడు’ ప్రత్యేక పరిశీలన చేయగా అనేక విషయాలు వెలుగు చూశాయి.
పాసుపుస్తకంలో సగం భూమి నమోదుకాలేదు మొర్రో అంటూ తిరుగుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాక కలెక్టరేట్‌కు వస్తే తిరిగి తహసీల్దారుకే ఆ దస్త్రాన్ని పంపుతున్నారు. తహసీల్ కార్యాలయం- కలెక్టరేట్‌ల మధ్య అర్జీలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కొక్కరూ పదుల సార్లు తిరిగిపోతున్నారు. బాధితులు పత్రాల జిరాక్స్ తీయడానికే రూ.వందలు ఖర్చు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ సమస్యలన్నీ 2017లో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం ఫలితంగా ఉత్పన్నమైనవే. నాడు సిబ్బంది చేసిన తప్పులు, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం ఇప్పుడు లక్షల మందికి శాపంగా మారింది. యజమానులకు తెలియకుండానే పాసుపుస్తకంలో భూ విస్తీర్ణాలను తగ్గించడం, కొందరికి పెంచడం(ఆర్‌ఎస్సార్).. కొందరు పట్టాదారులకు అసలు పాసుపుస్తకాలే జారీ చేయకపోవడం.. కొనుగోలు చేసినా పాత యజమాని పేరుతోనే దస్త్రాలు ఉండటం లాంటి ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. దస్త్రాల ప్రక్షాళన చేపట్టి ఐదేళ్లు పూర్తయినా హక్కుల కల్పనకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదు. అసైన్డ్, లావూణీ, ఇనాం భూములకు పాసుపుస్తకాలు చాలాచోట్ల మంజూరు చేయలేదు. బాధితులు ఎవరిని సంప్రదించాలనే దానిపైనా స్పష్టత లేకపోవడం గమనార్హం.
యాదాద్రి, జనగామ జిల్లాల్లో దయనీయం
* యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజావాణి అర్జీల్లో ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించినవే. వ్యాపారి వద్ద ఒప్పందంతో అప్పు తీసుకున్నామని, తమ వద్ద కొత్త పాసుపుస్తకం ఉండగానే ధరణిలో మరొకరి పేరుపైకి భూమిని మార్చారని... న్యాయం చేయాలని వలిగొండ మండలం వెలువర్తికి చెందిన యాదమ్మ కుమారులు ఫిర్యాదు చేశారు. పైగా వారసత్వ బదిలీ కింద మరో మార్పిడి చోటుచేసుకుందని ఫిర్యాదు చేశారు.
* తమ సగం భూమి పాసుపుస్తకంలో రాలేదని.. బొమ్మలరామారం మండలం యావాపూర్‌నకు చెందిన వెంకటస్వామి గోడు వెళ్లబోసుకున్నారు.
* హక్కులు కల్పించాలని, పట్టాలు జారీ చేయాలని సంస్థాన్ నారాయణపూర్, ఆలేరు తదితర చోట్ల నుంచి రైతులు కలెక్టరేట్‌కు వచ్చారు.
* తనకున్న మూడెకరాల్లో ఎకరం మాత్రమే పాసుపుస్తకంలో వచ్చిందని జనగామ జిల్లా ప్రజావాణిలో నర్మెట్టకు చెందిన పెంటమ్మ ఫిర్యాదు చేశారు.
* దేవాదుల కాల్వలో 28 గుంటలు పోగా మిగిలిన 3.12 గుంటల భూమిని నమోదు చేయాలంటూ రఘునాథపాలెం మండలం ఖిలాషాపురానికి చెందిన యాదగిరి అర్జీ ఇచ్చారు.
* మాజీ సిపాయి కేటగిరిలో శంకర్‌రెడ్డికి ప్రభుత్వం భువనగిరిలో నాలుగు ఎకరాలు ఇచ్చింది. ధరణిలో మాత్రం భూమి కేటగిరి వద్ద జనరల్‌గా పేర్కొనాల్సి ఉండగా సీలింగ్ అని నమోదు చేశారు. అంతే, ‘22ఎ’లో పడిపోయింది. దీంతో ఆయన ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఎన్నిసార్లు తిరిగినా సమస్య తీర్చడం లేదని వాపోతున్నారు.
సత్తెమ్మకు ఎంత కష్టం..
తన భూమికి పట్టా ఎందుకు ఇవ్వడం లేదంటూ భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి వేదికపై ఉన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని అడుగుతున్న 70 ఏళ్ల ఈ బామ్మ పేరు సత్తెమ్మ. ఆమె ఇచ్చిన కాగితం చూసిన అధికారి తహసీల్దారును సంప్రదించాలంటూ రాసిచ్చారు. ‘నాలుగోసారి ఇక్కడికి వచ్చిన. నెలకు రూ.1200 మందులకే అవుతున్నాయి. ఇక్కడికి వచ్చిపోవడానికి రూ.370 కావాలి. నా బాధ ఎవరికీ పట్టదా?’ అంటూ ఆ పెద్దావిడ ఆయన ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యేమిటంటే యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులోని 349/ఉ సర్వే నంబరులో 11 గుంటల భూమి ఆమె పేరుతో ఉంది. ధరణి రికార్డుల్లో ఆధార్ ఇన్‌కరెక్ట్, నాట్ సైన్డ్ అని చూపుతోంది. గతేడాది జులై, సెప్టెంబరులలో రెండుసార్లు మీసేవ ద్వారా దరఖాస్తు చేసినా సమస్య తీరలేదు.
న్యాయానికిపోతే అన్యాయమైంది!
అరవై ఆరేళ్ల ఈ రైతు పేరు కల్లపల్లి మడెప్ప. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణికి ఇప్పటికే 15 సార్లు వచ్చారు. సొంతూరు మునిపల్లి మండలం కంకోల్. ఆయనకు మూడు సర్వే నంబర్లలో 4.30 ఎకరాల భూమి ఉండగా ఇతరులకు చెందిన 1.06 ఎకరాలు అదనంగా చేర్చి పాసుపుస్తకం ఇచ్చారు. అదనంగా వచ్చిన భూమిని తొలగించడానికి అభ్యంతరమేదీ లేదంటూ నిజాయతీగా 2018లో ఆయన బాండ్‌పేపర్ రాసిచ్చారు. అదే తప్పయింది. 2021లో రెవెన్యూ అధికారులు ఏకంగా ఆయన భూమిని కూడా తొలగించి ఇతరుల పేర్లపైకి మార్చారు. ‘ఇదేంది సారూ! న్యాయానికి పోతే అన్యాయం చేశారంటూ తహసీల్దారు కార్యాలయానికి 30 సార్లు తిరిగినా ఫలితం లేకపోయింది’ అని మడెప్ప వాపోయారు.
నా భూమిని తొలగించారు..
ప్రైవేటు ఉపాధ్యాయుడైన దినేశ్‌రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లె. తన తండ్రి భాస్కర్‌రెడ్డి గిఫ్ట్‌డీడ్ కింద నాలుగు ఎకరాలు ఇవ్వగా 2010లో రిజిస్ట్రేషన్ చేసుకుని పాసుపుస్తకం పొందారు. 2019లో తన పహాణీ కాపీని పరిశీలించుకోగా 1.36 ఎకరాలు వేరే వ్యక్తులకు కేటాయించినట్లు గుర్తించారు. ‘‘నా అనుమతి లేకుండానే భూమిని తొలగించారు. సరిచేయాలని నాలుగేళ్లుగా తిరుగుతున్నా. ప్రజావాణికి రావడం ఇది మూడోసారి’’ అంటూ ఆయన నిట్టూర్చారు.
ఇదీ చదవండి: తెలంగాణలో విద్యుత్ సంస్థల పాత, కొత్త రుణాలకు కేంద్రం తాజా మెలిక