హిమాయత్‌సాగర్ పూర్తిగా నిండి... గేట్లు ఎత్తడం వల్ల మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. పురానాపూల్ నుంచి ముసారాంబాగ్ వరకు మూసీని ఆక్రమించుకుని నిర్మాణం చేసిన ఇళ్లు నీటిలోనే మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు రాగా... కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
వంతెనపై నుంచి...
ముసారాంబాగ్ వంతెనపై వరద పొంగి ప్రవహిస్తుండడం వల్ల మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి అంబర్‌పేట వైపు పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. నీటి ప్రవాహానికి బరువైన వస్తువులు కొట్టుకువస్తున్నాయి. కోఠి నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్లే వంతెనపై మూసీ పొంగి ప్రవహించగా రోడ్డు గుంతలమయంగా మారింది.
భారీగా వరద నీరు...
హైదరాబాద్ పాతబస్తీ డబీర్‌పురాలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బాబానగర్ చెరువు కట్ట తెగిపోవడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పాతబస్తీలోని పలు కాలనీలోకి పెద్దఎత్తున ప్రవాహం పోటెత్తుతోంది. నాలా మరమ్మతు పనులు చేస్తుండటం మరింత సమస్యగా మారింది. వరద నీరు దిగువకు వెళ్లే మార్గం లేక కాలనీలు ముంపునకు గురువుతున్నాయి. రహదారిపై నుంచి వెళ్తున్న నీటితో డబీర్ పురా వద్ద వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
జలదిగ్బంధం...
పాతబస్తీలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. అల్ జుబేల్ కాలనీ, జీఎంకాలనీ, రాయల్ కాలనీల్లో భారీగా నీరు చేరింది. ఫలక్‌నుమా వంతెన నుంచి డబీర్ పురా వెళ్లే మార్గంలో ఉన్న కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. దాదాపు 80 శాతం మంది బాధితుల్ని పునరావాస శిబిరాలకు తరలించినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మిగతా 20 శాతం మంది ఇళ్లలోని ఒకటో, రెండో అంతస్తుల్లో ఉంటున్నారని... వారి కావాల్సిన ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు పడవల ద్వారా వెళ్లి ఇస్తున్నట్లు చెబుతున్నారు.
వ్యక్తి గల్లంతు...
స్థానిక యువత సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కొంత కొలుకున్న ప్రాంతాలు... శనివారం రాత్రి మళ్లీ భారీ వాన కురవడంతో యథాతథా స్థితికి చేరాయి. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద మూసీనదిలో వ్యక్తి గల్లంతయ్యాడు. మూసీ ప్రవాహంలో వ్యక్తి కొట్టుకుపోతున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఆమె ఇంటిముందు మృతదేహం.. చనిపోయాడా, చంపేశారా?