Mission Bhagiratha Implementation in Telangana: మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన నదీజలాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. వంద శాతం ఇంటింటికీ నల్లా నీరు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 24వేల పైచిలుకు ఆవాసాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ జలాలు అందుతున్నాయి. పట్టణ ప్రాంతాలకు బల్క్‌గా నీటిని సరఫరా చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా అధికారులు నీటి సరఫరా సదుపాయాన్ని కల్పించారు.
అన్ని గ్రామాల సర్పంచుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరణ: ఈ భారీ ప్రాజెక్టు నిర్వహణ విషయమై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రత్యేకించి వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఇన్ టేక్ వెల్స్, వాల్వ్స్, పైప్ లైన్లు తదితరాలను సంబంధిత శాఖ అధికారులు పరిశీలిస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. వేసవి ప్రారంభం నుంచే ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ఇంజనీర్లతో సంబంధం లేకుండా హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం నుంచే రాష్ట్రంలోని అన్ని గ్రామాల సర్పంచుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
మిషన్ భగీరథ పథకం అమలుపై అధికారుల సమీక్ష: ఇటీవల మిషన్ భగీరథ పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన మిషన్ భగీరథ శాఖ కార్యదర్శి స్మితాసభర్వాల్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి... నేరుగా కొంత మంది సర్పంచులతో మాట్లాడి ఆయా గ్రామాల్లో నీటిసరఫరా గురించి ఆరా తీశారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా... వస్తే సిబ్బంది వెంటనే స్పందిస్తున్నారా లేదా అన్న విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాపై సర్పంచులు సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలను సర్పంచులు ప్రస్తావించారు. ఈ కసరత్తు మరింత విస్తృతంగా చేయాలని నిర్ణయించారు. ఎక్కడ చిన్నపాటి సమస్య ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించాలని ఇంజనీర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశమంతా కావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు భారతదేశానికి అవసరమని మహారాష్ట్రకు చెందిన రైతు ప్రతినిధుల బృందం కితాబు ఇచ్చారు. ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి.. సంక్షేమ పథకాలను వారు సందర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథతో పాటు మిగిలిన పథకాల తీరు చాలా బాగుందని ప్రశంసించారు.
ఇవీ చదవండి: