హైదరాబాద్ కోఠి ప్రాంతంలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో వెలసిన దుకాణాలను రెవిన్యూ అధికారులు తొలిగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోఠి ఆంధ్రాబ్యాంక్ కూడలి వద్ద సుమారు 240 గజాల స్థలంలో కొంతమంది దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు.
ఈ విషయంలో చాలాకాలంగా కోర్టులో వివాదం నడుస్తోంది. ఇటీవల మరికొందరు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి తహశీల్దార్ రామకృష్ణ, సిబ్బందితో కలిసి సుల్తాన్ బజార్ పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలిగించారు. స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేశారు.
అయితే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అన్యాయంగా అధికారులు కూల్చివేశారని బాధిత దుకాణ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 40ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని... ఏలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేశారని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.
ఇదీ చదవండి: KCR Meeting With Ministers : మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ