సుమారు రూ.21వేల కోట్లతో పిలిచిన కాళేశ్వరం ఎత్తిపోతల టెండర్లలో పాల్గొన్న గుత్తేదారుల సాంకేతిక అర్హతలను బుధవారం పరిశీలించనున్నారు. అర్హత సాధించినవారి ఆర్థిక బిడ్లను తర్వాత తెరిచి అందరి కన్నా తక్కువకు కోట్ చేసిన గుత్తేదారులకు పనులు అప్పగించనున్నారు. ఎనిమిది ప్యాకేజీలుగా విభజించిన ఈ పనులకు టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 28ని తుది గడువుగా నిర్ణయించారు.
- రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులోనే ఒక టీఎంసీ నీటిని శ్రీరామసాగర్‌కు ఎత్తిపోసేలా పునరుజ్జీవ పథకాన్ని చేపట్టింది.
- మొత్తం నీటి అవసరాలను పరిగణిస్తూ మూడు టీఎంసీలను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేలా నిర్ణయించింది. ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల వద్ద మూడో టీఎంసీ మళ్లింపు పనులను ఇప్పటికే గుత్తేదారుకు అప్పగించింది. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు అదనపు టీఎంసీ పనులకు ఇప్పుడు టెండర్ ప్రక్రియ చేపట్టింది.
- గతంలో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించి శ్రీరామసాగర్ వరద కాలువలో 99వ కి.మీ. వద్ద పోసి మిడ్‌మానేరుకు చేరుస్తున్నారు. ఈ మధ్యలోనే ఒక టీఎంసీ నీటిని శ్రీరామసాగర్‌కు మళ్లించేలా పునరుజ్జీవ పథకాన్ని పూర్తిచేయటంతో మధ్యమానేరుకు ఒక టీఎంసీ జలాలు మాత్రమే వస్తాయి. కాళేశ్వరం ఆయకట్టు అవసరాలన్నీ మిడ్‌మానేరు దిగువనే ఉన్నందున ఎల్లంపల్లి నుంచి అక్కడకు అదనంగా మరో టీఎంసీ చేపట్టేలా ఇప్పుడు టెండర్ ప్రక్రియ పూర్తిచేసి గుత్తేదారులకు అప్పగించనున్నారు.
- జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటి లింగాల వద్ద ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు పంపులను అమర్చే లిప్టును నిర్మిస్తారు. ఈ పని విలువ సుమారు రూ.6,000 కోట్లు. ఇదే జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ వద్ద నాలుగు పంపులతో మరో లిప్టు నిర్మిస్తారు. దీని విలువ సుమారు రూ.3,000 కోట్లు. ఈ లిప్టు ద్వారా ఎత్తిపోసిన నీటిని శ్రీరామసాగర్ వరద కాలువ 95వ కి.మీ వద్ద పోస్తారు. కాలువ లైనింగ్‌కు సంబంధించిన మరో రెండు ప్యాకేజీల పనులు ఉన్నాయి. ఈ మొత్తం నాలుగు ప్యాకేజీల పనుల విలువ సుమారు రూ.10,000 కోట్లని సంబంధిత వర్గాలు తెలిపాయి.
- మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు సమాంతరంగా నీటిని తీసుకెళ్లే పనులు, ఓపెన్ పంపుహౌస్‌ను ఒక ప్యాకేజీగా; అనంతగిరి నుంచి చిన్నగుండవెళ్లి వద్ద నిర్మించే పంపుహౌస్, సమాంతర నీటి పంపిణీ వ్యవస్థ పనులను ఇంకో ప్యాకేజీగా నిర్ణయించారు. ఈ రెండు పనుల విలువ రూ.9,400 కోట్లు.
- చిన్నగుండవెళ్లి నుంచి తుక్కాపూర్ వరకు గ్రావిటీ కాలువ, స్ట్రక్చర్లు, మల్లన్నసాగర్ వద్ద మరో పంపుహౌస్ నిర్మాణ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఈ పనుల విలువ రూ.2,200 కోట్లుగా నిర్ణయించారు.
- మొత్తంగా సుమారు రూ.21,000 కోట్ల విలువైన పనులకు సాంకేతిక అర్హత సాధించే గుత్తేదారులు ఎవరన్నది బుధవారం తేలనుంది.