Teacher MLC votes Counting Today : మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడు జరగనుంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. గత ఎన్నికలలో ఒకే రౌండ్లో లెక్కింపు పూర్తయ్యిందని.. ఈ సారి కూడా ఓకే రౌండ్లో పూర్తి కాకపోతే రెండో రౌండ్ లెక్కింపు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వికాస్‌రాజ్ వెల్లడించారు.
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. మూడు షిప్టుల్లో కూడా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశామన్నారు. గరిష్ట పారదర్శకత ఉండేలా కౌంటింగ్ సిబ్బందికి సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రంలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు సీఈవో తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తున్న సీఈఓ.. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్ల నుంచి వినియోగిస్తున్న సాంకేతికత వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి మార్చి 13న పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలోని తొమ్మిది జిల్లాల్లో సుమారు 29,720 మంది ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నారు. పోలింగ్ శాతం 90.40గా నమోదైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య టీచర్స్ నియోజకవర్గం కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొదటగా ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్లను... 25 ఓట్ల వంతున బండెల్ కట్టనున్నారు. తర్వాత ప్రాధాన్యత ఓట్ల క్రమంగా లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతంకు పైగా ఏ అభ్యర్థికి వస్తే వారిని విజేతగా ప్రకటించనున్నారు.
పోటీలో 21 మంది అభ్యర్థులు : మొదటి ప్రాధాన్యతలో ఎవరికి 50 శాతం వరకు రాకుంటే... తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ మొదలు పెట్టి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి 50 శాతంకు పైగా ఓట్లు వచ్చిన వారిని విజేతగా పకటిస్తారు. మొత్తం ఈ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రధాన పోటీ చెన్నకేశవ రెడ్డి, ప్రస్థుత ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మణిక్ రెడ్డి మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రతి టేబుల్‌కి ఒక సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది, ఒక అబ్జర్వర్‌ను నియమించారు. ఒక్కో రూంకు ముగ్గురు ఏ.ఆర్.ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద మరో ముగ్గురు ఏ.ఆర్.ఓలుగా అడిషనల్ కలెక్టర్లను నియమించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియంక అలా తెలిపారు.
ఇవీ చదవండి: