రోగనిరోధక శక్తి పెరగాలంటే పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ, తక్కువలు కాకుండా... మీరు చేసే పనికీ, మీ శరీర బరువుకూ తగినంత శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మేలైన మాంసకృత్తులు తప్పనిసరి. ఉదాహరణకు మీరు 65 కిలోల బరువు ఉన్నారనుకుంటే 65 గ్రాముల మాంసకృత్తులు మీకు అవసరమవుతాయని వారు చెప్తున్నారు.
దేని నుంచి ఎంత అందుతుందంటే!
100 గ్రాముల పప్పుల నుంచి 20 గ్రాముల ప్రొటీన్ అందుతుంది. అలాగే గుడ్డు నుంచి 8 గ్రాములు అందితే... 100 గ్రాముల చికెన్ నుంచి 18 గ్రాముల మాంసకృత్తులు అందుతాయి. అన్నం విషయానికొస్తే 100 గ్రాముల అన్నం నుంచి 8 గ్రాముల మాంసకృత్తులు అందుతాయి. అలాగని అన్నం ఎక్కువగా తీసుకుంటే ప్రొటీన్‌తోపాటు కార్బొహైడ్రేట్లు కూడా పెరిగిపోతాయి. అంతకంటే మీల్‌మీకర్ వేరుసెనగలు, నువ్వులు మంచి ప్రత్యామ్నాయం. ఏదైనా ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు దాంతో పోరాడటానికి అవసరమయ్యే కొన్నిరకాల యాంటీబాడీస్ తయారీకీ మాంసకృత్తులు చాలా అవసరం.
ఎ,బి,సి,డిలే మార్గం..
మీ శరీరానికి అవసరమయ్యే ఇమ్యూనిటీ పెరగడానికి విటమిన్ ఎ, బి, సి, డి, ఇ అవసరం. ఇవన్నీ వివిధ రకాల ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. జామ, ఉసిరి, నిమ్మజాతి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని నేరుగా తీసుకోవాలి. విటమిన్ ఇ... కొబ్బరి, గుడ్డు, కరివేపాకు, సెనగల్లో ఉంటుంది. తోటకూర, నెయ్యి, గుడ్డు, బొప్పాయి, క్యారెట్ లాంటి వాటిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. రాజ్మా, మాంసాహారం, నెయ్యి, పాలు.. వీటి నుంచి విటమిన్ డి లభ్యమవుతుంది. జింక్ మూలకం.. నువ్వులు, జీలకర్ర, గసగసాల్లో ఉంటుంది. సెలేనియం పచ్చిబఠాణీల నుంచి దొరుకుతుంది. ఇవేకాకుండా ఒమేగా 3 కొవ్వులు.. కావాలి. ఇవి అవిసెగింజలు వాల్‌నట్, గంగవల్లి కూర నుంచి లభిస్తాయి. పండ్లు వీలుకానప్పుడు మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు.
ఇవీ చూడండి: గిరిజన గురుకులాల్లో 1,950 మంది సీఆర్‌టీల కొనసాగింపు