ప్రవాస భారతీయులను పెళ్లి చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా తెలిపారు. ఎన్ఆర్ఐ వివాహాలు, మహిళలపై వేధింపులు, వరకట్నం, మోసాలకు సంబంధించిన అంశాలపై సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల మధ్య అంతర్గత సహకారం, సమన్వయం కోసం మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.
కొంతమంది మాయమాటలు చెప్పి... పెళ్లి చేసుకుని విదేశాలకు తీసుకెళ్లి అక్కడ భార్యలను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని స్వాతి లక్రా తెలిపారు. మహిళా ఎన్ఆర్ఐ సెల్‌తో పాటు రాష్ట్రంలోని పలు మహిళా ఠాణాల్లో 550కి పైగా వైవాహిక సంబంధిత కేసులు నమోదయ్యాయని అన్నారు.
అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోనే...
గతేడాది జూలైలో ప్రారంభించిన ప్రత్యేక ఎన్ఆర్ఐ సెల్ లో ఇప్పటివరకు 73 ఫిర్యాదులు అందగా వీటిలో 70 ఫిర్యాదులకు కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో 41 పెండింగ్ ట్రయల్స్‌లో, 46 లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని స్వాతి లక్రా పేర్కొన్నారు.
గత ఆరేళ్లలో మొత్తం 574 ఎన్ఆర్ఐ కేసులు నమోదు చేశామని అన్నారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 248 కేసులు, రాచకొండ పరిధిలో 99 కేసులు, సైబరాబాద్ పరిధిలో 99, వరంగల్‌లో 42 కేసులు నమోదయ్యాయి. ఎన్నారై వివాహాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచే ఆడియోను, కరపత్రాన్ని ఆమె విడుదల చేశారు.