అవుటర్ రింగు రోడ్డు వెలుపల నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డు దస్త్రాలు కదులుతున్నాయి (regional ring road in telangana). 344 కిలోమీటర్ల ప్రాంతీయ రింగు రోడ్డును రెండు (ఉత్తర, దక్షిణ) భాగాలుగా నిర్మించనున్న విషయం తెలిసిందే. రెండు భాగాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్ని(అలైన్‌మెంట్) నిర్ణయించి కేంద్రానికి పంపింది. ఇందులో ఉత్తర మార్గాన్ని(అలైన్‌మెంట్) ఖరారు చేసేందుకు అధ్యయనం సాగుతుండగా.. దక్షిణ భాగానికి తాత్కాలిక జాతీయ రహదారి నంబరు కేటాయింపు, నోటిఫికేషన్ జారీకి జాతీయ రహదారుల మంత్రిత్వశాఖలో దస్త్రం సిద్ధం అవుతోంది.
దక్షిణ భాగంలో చౌటుప్పల్- ఇబ్రహీంపట్నం- ఆమనగల్- షాద్‌నగర్- చేవెళ్ల- శంకరపల్లి- కంది- సంగారెడ్డి వరకు 162 కిలోమీటర్ల మార్గం ఉంటుందని అంచనా (regional ring road in telangana). ఆ మార్గం నివేదికను ఇప్పటికే కన్సల్టెంట్ సంస్థ కేంద్రానికి అందజేసింది. అందిన మూడు రకాల ప్రతిపాదనలను మంత్రిత్వశాఖ అధికారులు పరిశీలించి చిన్నచిన్న సవరణ చేశారు. నవంబరు రెండో వారం నాటికి ఒక మార్గాన్ని ఖరారు చేస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు ప్రత్యేక బృందాలను నియమించాల్సి ఉంటుంది. భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని నిర్ణయించాయి.
ఇదీ చూడండి: ORR: ఔటర్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు రేపు ప్లాట్ల కేటాయింపు