Police notices to Etala Rajender: పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని ఆయన నివాసానికి వెళ్లి.. తాఖీదులు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు అందించారు. ఈటల రాజేందర్ పీఏలు రాజు, నరేంద్రలకు ఈ నోటీసులను అందించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు. విచారణకు రావాలని పోలీసులు నుంచి నోటీసులు అందాయని పేర్కొన్నారు. మొదట తమ న్యాయవాదులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈనెల 10న విచారణకు హాజరవుతానని తెలిపారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు హన్మకొండ డీసీపీ ఆఫీసుకు వెళ్తానని ఈటల వెల్లడించారు.
10th class question paper case updated: హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి ముందు రోజే నిందితుడు ప్రశాంత్‌తో కలిసి కుట్ర చేసినట్లు ఆధారాలు లభించడంతోనే ఎంపీ బండి సంజయ్‌ను అరెస్టు చేసినట్లు వరంగల్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు. ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్‌తోపాటు ఈటల రాజేందర్‌కు, ఆయన పీఏలకు కూడా పంపినట్లు ఆయన వివరించారు. అనేక మంది బీజేపీ నాయకులకూ లీకేజీ సమాచారం వెళ్లినట్లు తెలిపారు.
కానీ బండి సంజయ్, ప్రశాంత్‌ల మధ్య సోమవారం సాయంత్రమే చాటింగ్ జరిగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్లాన్ ప్రకారం హిందీ పేపర్ లీకేజీని వైరల్ చేసినట్లు సీపీ స్పష్టం చేశారు. కమలాపూర్‌లో ముందురోజు తెలుగు బిట్ పేపర్ కూడా బయటికొచ్చినట్లు దర్యాప్తులో తేలినట్లు వివరించారు. ఈనేపథ్యంలో పోలీసులు ఈటల రాజేందర్‌కు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు అందించారు.
బండి సంజయ్ రిమాండ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ: మరోవైపు ఈకేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ రిమాండ్ పిటిషన్‌ను హైకోర్టు విచారణ జరిపింది. పార్లమెంటు సమావేశాలు, ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు హాజరయ్యేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని బండి సంజయ్ తరపు న్యాయవాదులు కోరగా.. అందుకు కోర్టు నిరాకరించింది. రిమాండ్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌లో బెయిల్ ఎలా ఇవ్వగలమని పేర్కొన్న న్యాయస్థానం వేరే పిటిషన్ వేసుకోవచ్చునని సూచించింది. సంజయ్ పిటిషన్‌పై కౌంటర్లు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ఈనెల 10న విచారణ చేపడతామని పేర్కొంది.
ఇవీ చదవండి:
హెబియస్ కార్పస్ పిటిషన్‌పై పోలీసులకు హైకోర్టు నోటీసులు
పోలీసులకు 'బలగం' సినిమా చూపిస్తే బాగుండేదన్నారు: బండి సంజయ్ భార్య