ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి(40)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఆయనలో లక్షణాలేవీ లేవు. ఎవరి ద్వారా సోకిందో కూడా తెలియదు. వాళ్ల సమీపంలోని దవాఖానాలో కరోనా పరీక్షలు చేస్తుంటే.. అందరితో పాటు తనూ వెళ్లి పరీక్షించుకున్నారు. పాజిటివ్‌గా తేలడంతో ఇంటిపట్టునే ఉంటున్నారు. ఆరోగ్య సిబ్బంది ఇచ్చిన మందులు వాడారు. మొదటి వారంలో స్వల్పంగా జ్వరం, దగ్గు కనిపించినా.. 7 రోజుల్లోపే ఆ లక్షణాలు తగ్గిపోయాయి. నాలుగు వారాలు గడిచినా దుకాణ యజమాని మాత్రం ఇప్పట్లో పనికి రావద్దని ఆయనకు సూచించారు. ఈ నెల రోజులూ ఇంటి వద్దనే ఉంటున్నందున వేతనంలో కోత విధించారు. కుటుంబం గడవడం కష్టమవుతోందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
ఇళ్లలో పనిచేస్తున్న ఓ మహిళ(32)కు కొవిడ్ నిర్ధారణ అయింది. అపార్ట్‌మెంటులో అందరికీ పరీక్షలు నిర్వహించే క్రమంలో అందులో పనిచేస్తున్న వారికీ చేశారు. ఈ మహిళలో వైరస్ పాజిటివ్‌గా తేలింది. కానీ ఈమెకు ఎలాంటి లక్షణాలు లేవు. అయినా జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇచ్చిన మందులు వేసుకున్నారు. లక్షణాలేవీ లేకుండానే 10 రోజులు గడిచిపోయాయి. తిరిగి పనికొస్తానంటే మరో రెండు వారాల వరకూ రావడానికి వీల్లేదని అపార్ట్‌మెంటులో స్పష్టం చేశారు. భర్త ఆటోడ్రైవర్. ఇద్దరు పిల్లలు. ఒకపక్క భర్తకు ఆటో గిరాకీ తగ్గిపోయింది. ఇప్పుడు ఈమె కూడా పనులకు వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
కరోనా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాజిటివ్‌గా తేలితే వారాల తరబడి పనులకు హాజరు కాకుండా ఉండాల్సి వస్తోంది. లక్షణాలు లేకపోయినా.. అత్యధికులు నెల రోజులకు పైగా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇది సాధారణ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మళ్లీ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలినట్లు ధ్రువపత్రం ఉంటే తప్ప తిరిగి పనుల్లోకి చేర్చుకోలేమని కొందరు స్పష్టం చేస్తుండడంతో.. ఎటూ పాలుపోని సందిగ్ధ స్థితిలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మార్గదర్శకాల ప్రకారం.. పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు(ఎసింప్టమేటిక్) లేకపోతే 17 రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి హాజరు కావచ్చని ఇప్పటికే స్పష్టం చేసింది. నిర్దేశిత కాలం పూర్తయ్యాక తిరిగి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరమూ లేదని చెప్పింది. ఇందులో నెలకొన్న సందేహాలను ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు ముందుంచగా ఆయన నివృత్తి చేశారు.
ఐసొలేషన్ 10+7 రోజులే
- పాజిటివ్ కేసుల్లో సాధారణంగా 85 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వారికి తెలియకుండానే వైరస్ సోకి, కొంత కాలం తర్వాత తగ్గిపోతుంది.
- ఇలాంటి వ్యక్తుల్లో పాజిటివ్‌గా వచ్చినవారు ఇంటి వద్దనే ఐసొలేషన్‌లో ఉండడం మేలు.
- ఒకవేళ ఇంటి వద్ద విడి గది, ప్రత్యేక బాత్‌రూమ్ సౌకర్యం లేకపోతే.. ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో ఉండొచ్చు.
- ఈ తరహా పాజిటివ్ వ్యక్తులు 10 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత మరో 7 రోజుల పాటు జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి లక్షణాలేమైనా ఉన్నాయా? పరిశీలిస్తూ ఇంటిపట్టునే ఉండాలి.
- గడువు పూర్తయ్యే వరకు లక్షణాలేవీ కనిపించకపోతే కరోనా నుంచి బయటపడినట్లుగానే భావించాలి.
- అంటే 17 రోజుల అనంతరం యథావిధిగా విధులకు హాజరు కావచ్చు.
స్వల్ప లక్షణాలున్న వారు కూడా..
- స్వల్ప లక్షణాలున్నవారు కూడా ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండాలి. అయితే వీరు వైద్యుని సంప్రదింపుల ద్వారా చికిత్స పొందుతుండాలి.
- వీరిలోనూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక తొలి 10 రోజులు పరిశీలిస్తుండాలి. ఆఖరి మూడు రోజుల్లో జ్వరం రాకుండా ఉంటే.. ఆ తర్వాత మరో 7 రోజులు పరిశీలనలో ఇంటి వద్దే ఉండాలి.
- మొత్తంగా ఆఖరి 10 రోజుల్లో లక్షణాలు కనిపించకపోతే.. వీరు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 17 రోజుల తర్వాత పనులకు హాజరు కావచ్చు.
- ఒకవేళ ఈ సమయంలో మళ్లీ లక్షణాలు కనిపిస్తే.. యథావిధిగా ఐసొలేషన్‌లో కొనసాగించాల్సిందే. తిరిగి విధుల్లో చేరడానికి ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
- ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినవారు డిశ్ఛార్జి అయిన తర్వాత.. ఇంటి వద్ద వారంపాటు ఆరోగ్యాన్ని గమనిస్తుండాలి. ఆ సమయంలో లక్షణాలు తిరిగి కనిపించకపోతే పనులకు హాజరు కావచ్చు. లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్యుని సూచనలతో చికిత్స పొంది అనంతరం విధులకు వెళ్లాల్సి ఉంటుంది.