రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) అధికారుల మధ్య సమన్వయ లోపంతో రాజధానిలో కరోనా వైరస్ పెచ్చరిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం, కరోనా వ్యాధి నిర్ధరణ అయిన వారిలో లక్షణాలు తక్కువగా ఉంటే ఇంట్లోనే ఉంచి పర్యవేక్షించడం వైద్య ఆరోగ్య శాఖ బాధ్యత. లక్షణాలు అధికంగా ఉంటే తక్షణం ఆస్పత్రికి తరలించే బాధ్యత బల్దియాది. కొవిడ్-19 పరీక్షల ఫలితాలు సకాలంలో బల్దియా అధికారులకు చేరడంలేదు. దీంతో బల్దియా కూడా వారిని కట్టడి చేయలేకపోతోంది. ఏ విషయం తెలియక వైరస్ లక్షణాలతోనే కొందరు ఇష్టానుసారం తిరుగుతున్నారు. ఫలితంగా నగరంలో కేసులు గణనీయంగా పెరిగే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహానగరంలో కరోనా వైరస్ విస్తరణకు సమర్ధంగా అడ్డుకట్ట వేయడానికి దాదాపు 50 వేల పరీక్షలను చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఏరియా ఆసుపత్రులు, సంబంధిత ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కొవిడ్-19 పరీక్షలు ప్రారంభించారు. గతం కంటే అనుమానితుల నమూనాల సేకరణ పెరిగింది. ఆ మేరకు బాధితులూ పెరుగుతున్నారు. మరోవైపు నమూనాల సంఖ్య పెరగడం వల్ల ఫలితాల వెల్లడిలోనూ జాప్యమవుతోంది.
ఫలితాలు వచ్చిన వెంటనే బాధితుల జాబితాను పోలీసులకు, బల్దియాకు పంపించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ అధికారులది. అక్కడా ఆలస్యమవుతోంది. కొన్నిసార్లు పరీక్ష ఫలితాలు సకాలంలో అందినా రోగులను ఆసుపత్రికి తరలించే విషయంలో బల్దియాకు చెందిన క్షేత్రస్థాయి అధికారులూ ఆలస్యం చేస్తున్నారు. వైరస్ నిర్ధరణ అయిన వ్యక్తి చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చిన తరువాత వైద్యుడి సిఫారసు ఉంటేనే ఆసుపత్రికి తరలిస్తున్నారు.
బల్దియా నిర్లక్ష్యం!
సకాలంలో జాబితా బల్దియాకు అందించినా కొందరు జోన్‌స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల బాధితుడి గృహాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా మార్చడంలో ఆలస్యమవుతోంది. ఒక్కోసారి ఆ ఇంటి వైపు కూడా అధికారులు తొంగి చూడటం లేదు. కొవిడ్ సోకినవారితో పాటు ఇంట్లో అనుమానితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. నెల రోజుల కిందటి వరకు కట్టడి ప్రక్రియ పక్కాగా సాగింది. అప్పుడు కేసులు ఇంత పెచ్చరిల్లలేదు. ఇప్పుడు కేసులు భారీగా పెరిగాక నెలకొన్న నిర్లక్ష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఇదిగో ఉదాహరణ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఈనెల 18న 36 మందికి కరోనా వైద్య పరీక్షలు చేశారు. నమూనాలిచ్చిన వారిలో అప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారున్నారు. మరునాడే ఫలితాలు రావాల్సి ఉండగా ఐదు రోజుల తరువాత జూన్ 22న వచ్చాయి. 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ ఐదు రోజులు ఆ 8 మంది బయట తిరుగుతూనే ఉన్నారు. వీరు మరెంతమందికి వైరస్ అంటించారన్న విషయమై ఆందోళన నెలకొంది. సోమవారం రాత్రి వరకు అధికారిక జాబితా జీహెచ్‌ఎంసీకి చేరలేదు. ఇతర ఆసుపత్రుల ఫలితాలు తీరు దాదాపు ఇలానే ఉంది.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్